Andhra Pradesh: గుంటూరులో అక్రమ మైనింగ్ పై హైకోర్టు ఆగ్రహం.. అధికారులు తప్పు చేశారంటూ మండిపాటు!
- 40 లక్షల టన్నుల సున్నపురాయి అక్రమ తవ్వకాలు
- అడ్డుకోకుండా చోద్యం చూస్తున్న అధికారులు
- ప్రభుత్వ వాదనను తిరస్కరించిన ధర్మాసనం
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో అక్రమ సున్నపురాయి తవ్వకాలపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో అక్రమార్కులకు అండగా నిలిచిన ప్రభుత్వాధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అక్రమ తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం నిబంధనలు ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది
ప్రభుత్వం ఆదాయం కోల్పోవడానికి కారణమైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో నష్టాన్ని భర్తీ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్), ను ఆదేశించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదిస్తూ.. ఈ కేసును సీఐడీకి అప్పగించామని తెలిపారు.
తుది వివరాల సమర్పణకు మరో 3 వారాల గడువు కావాలన్నారు. అయితే ఈ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. వారం రోజుల్లోగా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. గత మూడున్నరేళ్లుగా గుంటూరు జిల్లాలోని దాచేపల్లి, నడికుడి, కేశనుపల్లి, కోనంకి, కొండమోడు తదితర ప్రాంతాల్లో దాదాపు 40 లక్షల టన్నుల సున్నపురాయిని అక్రమంగా తవ్వి రవాణా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దాదాపు రూ.320 కోట్ల విలువైన సున్నపురాయిని కొందరు అక్రమంగా తవ్వి అమ్ముకున్నట్లు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.