Pakistan: పాక్ విషయంలో మా వైఖరి మారలేదు: అమెరికా

  • పాక్‌ ను మరోసారి హెచ్చరించిన అమెరికా విదేశాంగ మంత్రి 
  • ఉగ్రవాద నిరోధానికి పాక్ నిజాయతీగా వ్యవహరించాలి
  • ఇదే విషయాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు స్పష్టం చేసిన అమెరికా

ఉగ్రవాద కార్యాకలాపాలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్‌ను అగ్రరాజ్యం అమెరికా మరోసారి తీవ్రంగా హెచ్చరించింది. ఉగ్రవాదం అణచివేత దిశగా పాకిస్తాన్ నిజాయతీగా వ్యవహరించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని యూఎస్ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పొంపియో హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్‌, పాక్ పశ్చిమ సరిహద్దు వెంబడి ఉద్రవాదాన్ని అణచివేయాలని మరోసారి డిమాండ్ చేశారు. ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాకిస్తాన్ వెళ్లిన తాను ఇదే విషయాన్ని ఆయనకు వివరించానని నిన్న విలేకరులతో మాట్లాడిన పొంపియో వెల్లడించారు.

దక్షిణ మధ్య ఆసియా విషయంలో అమెరికా విధానం మారదని, ఉగ్రవాద కార్యాకలాపాలకు పాకిస్తాన్ ఆశ్రయమివ్వకూడదని తాము కోరుకుంటున్నామని, తాలిబాన్, హక్కానీ వంటి ఉగ్రవాద సంస్థలకు పాక్ ఆశ్రయమివ్వరాదని, ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతిని స్థాపించాలని పొంపియో ఆకాంక్షించారు.

పాకిస్తాన్ విషయంలో అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పులేదని మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిజాయతీగా, సంతృప్తికరమైన చర్యలు తీసుకునే వరకూ పాక్‌కు రక్షణ సహాయం అందించబోమని తేల్చిచెప్పారు. ఇదిలావుండగా ఉద్రవాద నిరోధానికి పాక్ సరైన చర్యలు తీసుకోలేదని పేర్కొన్న ట్రంప్ సర్కార్, గతేడాది 300 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం నిలిపివేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News