Andhra Pradesh: రూ.25,000 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులు నాలుగేళ్లలో రూ.2,500 కోట్లకు ఎలా కరిగిపోయాయి?: బీజేపీ నేత జీవీఎల్

  • సీఐడీ చంద్రన్న ఇంటరెస్ట్ డిపార్ట్మెంట్ గా మారింది
  • స్వాధీనం చేసుకున్నవాటిలో 54 ఆస్తులను మాత్రమే బయటపెట్టారు
  • మంత్రి పుల్లారావుకు క్లీన్ చిట్ ఇచ్చి కాపాడారు

అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 254 ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు ఇప్పుడు కేవలం 54 ఆస్తులనే బయటపెట్టారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. 2014లో స్వాధీనం సమయంలో రూ.25,000 కోట్లుగా ఉన్న ఆస్తుల విలువ ఇప్పుడు హారతి కర్పూరంలా రూ.2,500 కోట్లకు దిగజారడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సీఐడీ అన్నది చంద్రన్న ఇంట్రెస్ట్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందని జీవీఎల్ ఎద్దేవా చేశారు. ఈ రోజు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

అగ్రిగోల్డ్ ఆస్తులను తెలుగుదేశం పచ్చ చొక్కాలు మింగేశారని జీవీఎల్ ఆరోపించారు. పలువురు టీడీపీ మంత్రులు, వారి భార్యలు ఆ ఆస్తులను ముచ్చటపడి మరీ ఆక్రమించుకున్నారని వెల్లడించారు. ఇలాంటి ఘటనలపై సీఐడీ విచారణ చేస్తుందా? లేక కాకమ్మ కబుర్లు చెబుతుందా? అని ప్రశ్నించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై వచ్చిన ఆరోపణలపై సీఐడీ క్లీన్ చిట్ ఇచ్చిందనీ, ఇలాంటి చర్యల ద్వారా అవినీతిపరుల్ని సీఐడీ కాపాడుతోందని మండిపడ్డారు.

హాయ్ ల్యాండ్ భూములపై మంత్రి లోకేశ్ కన్నుపడిందనీ, అందుకే ఆస్తుల వేలంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో బ్యాంకులకు లేఖ రాస్తాననీ, ఆస్తుల వేలాన్ని సక్రమంగా చేపట్టాల్సింగా కోరతానని జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రజల సొమ్మును కొట్టివేసే ఈ కుట్రలో భాగస్వాములైన అందరూ జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. టీడీపీ పచ్చ చొక్కాలు అగ్రిగోల్డ్ భూములను నొక్కేసేందుకు యత్నిస్తున్నాయని జీవీఎల్ విమర్శించారు.

Andhra Pradesh
Chandrababu
cid
gvl narasimha rao
Telugudesam
BJP
agrigold
Nara Lokesh
banks
auction
  • Loading...

More Telugu News