shivaparvathi: శోభన్ బాబు గారికి నేను ఎప్పటికీ రుణపడి వుంటాను: నటి శివపార్వతి
- శోభన్ బాబు గారంటే ఎంతో అభిమానం
- ఆయన సినిమాలు బాగా చూసే దానిని
- ఆయనతో కలిసి నటించడానికి భయం వేసింది
ఒక వైపున స్టేజ్ పై నాటకాలు వేస్తూనే .. మరో వైపున 'ఎర్రమల్లెలు' .. 'సప్తపది' .. 'జడ గంటలు' వంటి సినిమాలలో శివపార్వతి చిన్న చిన్న వేషాలు వేస్తూ వచ్చారు. ఆ తరువాత ఆమె కెరియర్ 'సర్పయాగం' సినిమాతో మలుపు తిరిగింది. ఆ సినిమాలో ఆమె శోభన్ బాబుతో కలిసి నటించారు. తాజాగా ఆమె ఆ విషయాలను గురించి ప్రస్తావిస్తూ .. "మొదటి నుంచి కూడా నాకు శోభన్ బాబు గారంటే చాలా అభిమానం. ఆయన నటించిన 'మానవుడు దానవుడు' 30 సార్లు చూశాను.
అలాంటి శోభన్ బాబు గారితో కలిసి నటిస్తానని కలలో కూడా ఊహించలేదు. అప్పటికే నటిగా మంచి అనుభవం ఉన్నప్పటికీ, ఆయనతో కలిసి నటించడానికి చాలా భయపడిపోయాను. ఆయన నన్ను దగ్గరికి తీసుకుని .. 'ఎందుకు భయపడుతున్నావమ్మా .. నువ్వు మంచి ఆర్టిస్టువి .. టెన్షన్ పడకుండా చేయి' అంటూ నాలోని భయాన్ని పోగొడుతూ ప్రోత్సహించారు. ఆయన గనుక 'ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ ఆర్టిస్ట్ ని' అని విసుక్కుని వుంటే, ఈ రోజున నేను ఈ స్థాయికి వచ్చేదానిని కాదు. అందుకే ఆ మహానుభావుడికి నేను ఎప్పటికీ రుణపడి వుంటాను' అని చెప్పుకొచ్చారు.