Cricket: మళ్లీ మైదానంలోకి క్రికెటర్ జహీర్ ఖాన్.. షార్జా టీ10 లీగ్ లో ఆడనున్న స్పీడ్ స్టర్!
- వచ్చే నెల 23 నుంచి షార్జాలో టోర్నమెంట్
- జహీర్ తో పాటు ప్రవీణ్ కుమార్, ఆర్పీ సింగ్, బద్రీనాథ్ కూడా
- వివరాలు వెల్లడించిన లీగ్ చైర్మన్ ముల్క్
సాధారణంగా రిటైర్ అయిన క్రికెటర్లలో చాలామంది వ్యాఖ్యాతలుగా మారి కోట్ల రూపాయలను అర్జిస్తున్నారు. మరికొందరేమో సొంత క్రికెట్ కోచింగ్ సెంటర్లను స్థాపించి యువతలోని ప్రతిభను సానబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్పీడ్ స్టర్ జహీర్ ఖాన్ మళ్లీ బంతిని పట్టుకోనున్నాడు. ఈ ఏడాది నవంబర్ 23 నుంచి షార్జాలో జరగనున్న టీ10 లీగ్ రెండో ఎడిషన్ లో జహీర్ బౌలింగ్ చేయనున్నాడు.
టీ10 లీగ్ తొలి ఎడిషన్ లో వీరేంద్ర సెహ్వాగ్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇప్పుడు జహీర్ తో పాటు ప్రవీణ్ కుమార్, ఆర్పీ సింగ్, ఆర్ఎస్ సోధి, బద్రీనాథ్ సహా మరో ముగ్గురు ఆటగాళ్లు భారత్ తరఫున రెండో ఎడిషన్ లో పోటీ పడనున్నారు. ఇక విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్, ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ సైతం ఈ టోర్నమెంట్ లో ఆడనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ఈ విషయమై లీగ్ చైర్మన్ షాజీ ఉల్ ముల్క్ మాట్లాడుతూ.. రానున్న కాలంలో మరింత మంది అంతర్జాతీయ క్రికెటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తాజా లీగ్ రెండో ఎడిషన్ లో 8 మంది భారత ఆటగాళ్లు ఆడనుండటం సంతోషకరమన్నారు. దీనివల్ల టీ10 లీగ్ కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందన్నారు.