Hyderabad: మంగళవారమైతే బాగా కలిసొస్తుందని.. దొంగతనాలకు ఆ రోజే స్పాట్!

  • ఇతర రోజుల్లో దొంగతనానికి వెళ్తే ‘గిట్టుబాటు’ కాని వైనం
  • మంగళవారమైతే బేఫికర్
  • ఘరానా దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సాధారణంగా శుభకార్యాలకు వారం, వర్జ్యం, తిథులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, దొంగతనం కూడా తనకు శుభకార్యమే కాబట్టి ఓ ఘరానా దొంగ దోపిడీలకు మంగళవారాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. దీని వెనక కూడా ఓ బలమైన కారణం ఉంది. గతంలో పలుమార్లు ఇష్టం వచ్చిన రోజుల్లో దొంగతనానికి వెళితే అనుకున్నంత సొత్తు దొరక్కపోవడం, పోలీసులకు దొరికిపోవడం జరుగుతుండడంతో ముహూర్తాన్ని మంగళవారానికి మార్చాడు. అయితే, అది కూడా కలిసొచ్చినట్టు లేదు.. తాజాగా మరోమారు పోలీసులకు చిక్కాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బార్కస్‌కు చెందిన సమీర్ ఖాన్ అలియాస్ సమీర్ పఠాన్ అలియాస్ షోయబ్ సీడీలు, వస్త్రాల వ్యాపారం చేసేవాడు. 2008లో సెల్‌ఫోన్ చోరీ కేసులో అరెస్టయ్యాడు. ఇక అప్పటి నుంచి దొంగగా మారాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసే సమీర్‌పై 30కిపైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా జైలులో పరిచయమైన ఓల్డ్ మలక్‌పేటకు చెందిన షోయబ్‌ను అనుచరుడిగా మార్చుకున్న సమీర్ ఇద్దరూ కలిసి దొంగతనాలకు పాల్పడడం మొదలుపెట్టారు.

పగటి పూట ఇద్దరూ కలిసి బైక్‌పై తిరుగుతూ దొంగతనానికి అనువైన ఇంటిని ఎంచుకుంటారు. రాత్రికి వచ్చి పనికానిస్తారు. అయితే, దొంగతనం చేయాల్సిన ఇంటిని ఎంచుకున్నా మంగళవారం వరకు ఆగుతారు. ఆ రోజే ఇంట్లోకి చొరబడి విలువైన సొత్తును దోచుకెళ్తారు. మంగళవారం కాకుండా ఇతర రోజుల్లో దొంగతనానికి వెళ్తే ఆ ఇంట్లో ఏమీ దొరకకపోవడమో, పోలీసులకు దొరికిపోవడమో జరుగుతోందట.

 దీంతో మంగళవారమే సరైన రోజుని భావించి ఆ రోజుల్లోనే స్పాట్ పెడుతున్నారు. పోలీసులకు చిక్కకుండా హెల్మెట్ ధరించడం, సిమ్‌కార్డులు మార్చడం వంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. వీరిపై నిఘాపెట్టిన పోలీసులు తాజాగా సమీర్, అతడి సహాయకుడు షోయబ్‌ను పట్టుకున్నారు. వారి నుంచి  నుంచి రూ.21 లక్షల విలువైన 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad
Theft
sameer
Crime News
police
Tuesday
  • Loading...

More Telugu News