Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ‘తిత్లీ’ లాంటి విపత్తులు వస్తాయని ముందే హెచ్చరించా!: సీఎం చంద్రబాబు

  • ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని కోరా
  • కేంద్రం మాత్రం మొండిచెయ్యి చూపింది
  • అయినా పట్టుదలతో విపత్తులను ఎదుర్కొన్నాం
  • నీరు-ప్రగతి కార్యక్రమంపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనే తిత్లీ లాంటి విపత్తుల గురించి తాను హెచ్చరించానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తీరప్రాంతం ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలనీ, అందుకు ఇతోధికంగా నిధులు ఇవ్వాల్సిందిగా తాను కోరానని వెల్లడించారు. అయితే కేంద్రం మాత్రం ఉద్దేశపూర్వకంగా సాయం చేయడం లేదని ఆరోపించారు. ఈ రోజు అమరావతిలో నీరు-ప్రగతి పథకం అమలు పురోగతిని చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తీరప్రాంతం కారణంగా తుపాన్లు, తరచూ కరవు పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడుతున్నట్లు తాను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లానని చంద్రబాబు తెలిపారు. ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరానన్నారు. అయితే కేంద్రం ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రం సాయం చేయకున్నా పట్టుదలతో రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నామనీ, విపత్తులను ధైర్యంగా ఎదుర్కొంటున్నామని ముఖ్యమంత్రి అన్నారు.

తిత్లీ తుపానుతో పాటు కరవు కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. వనరులు, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదన్నారు. పరిమిత వనరులతో ఏపీ అద్భుతాలను సాధిస్తోందని సీఎం కితాబిచ్చారు. గత నాలుగేళ్లలో రెండు తుపాన్లతో పాటు రెండేళ్ల పాటు కరువును రాష్ట్రం ఎదుర్కొందని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు.

Andhra Pradesh
Chandrababu
central government
an gry
titli
storm
neeru pragati
tele conference
  • Loading...

More Telugu News