Andhra Pradesh: ‘మాకు అభివృద్ధి అక్కర్లేదు.. హోదా చాలు' అని ఏపీ ప్రభుత్వం చెబుతోంది!: బీజేపీ నేత రామ్ మాధవ్ విసుర్లు
- అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని కాపాడుతున్నారు
- అవినీతితో 4వ స్థానంలో రాష్ట్రాన్ని పెట్టారు
- ప్రశ్నించినవారిని ఆంబోతులంటూ విమర్శిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేసిన యాజమాన్యాన్ని ఏపీ ప్రభుత్వం కాపాడుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆరోపించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తెలుగు దోపిడీ పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ దోపిడీ దారుల చేతిలో లక్షలాది ప్రజలు బాధితులుగా మారిపోయారని విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ ఈరోజు విజయవాడలో ఐదు రోజుల ధర్మపోరాట దీక్ష(రిలే) ప్రారంభించింది. ఈ సందర్భంగా రామ్ మాధవ్ అధికార టీడీపీపై నిప్పులు చెరిగారు.
పలువురు అగ్రిగోల్డ్ బాధితులు ఢిల్లీకి వచ్చి తమను కలిశారనీ, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై తమవద్ద ఆవేదన వ్యక్తం చేశారని రామ్ మాధవ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో, ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని రామ్ మాధవ్ జోస్యం చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు తొలుత నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం రూ.6,500 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. భూకబ్జా దారులకు అండగా నిలబడుతున్న ప్రభుత్వం.. లక్షలాది మంది పేద ప్రజల పొట్ట కొడుతోందని విమర్శించారు.
అవినీతిలో ప్రస్తుతం తెలంగాణ రెండో స్థానంలో, ఏపీ నాలుగో స్థానంలో ఉన్నాయని రామ్ మాధవ్ చెప్పారు. ఏపీలో 70 శాతం ప్రజలు లంచం ఇవ్వాల్సి వస్తుందని చెప్పడం దారుణమన్నారు. చీటికిమాటికీ కేంద్రంపై అపనిందలు వేయడం, ప్రశ్నించినవారిని దూర్భాషలాడటం టీడీపీ నేతలకు అలవాటు అయిపోయిందని విమర్శించారు. ప్రశ్నించిన వారిని ఆంబోతులు, రాష్ట్ర ద్రోహులుగా టీడీపీ నేతలు ముద్రవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో హిట్లర్ తరహా పాలన సాగుతోందని దుయ్యబట్టారు.
ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాకపోయినా అంతకు మించిన సాయాన్ని అందజేస్తామని కేంద్రం ఏపీకి హామీ ఇచ్చిందని రామ్ మాధవ్ తెలిపారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ‘మాకు అభివృద్ధి అక్కర్లేదు. హోదా చాలు’ అంటూ కొత్త పల్లవి అందుకుందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు ఇప్పటివరకూ ఏపీ ప్రభుత్వం లెక్కలు చెప్పలేదన్నారు.