Mandhu Manoj: రాయలసీమకు వస్తున్నా... రాగి సంగటి, మటన్ పులుసు రెడీగా పెట్టండి: మంచు మనోజ్

  • అభిమానులకు లేఖను రాసిన మంచు మనోజ్
  • కోరుకుంటున్న మనశ్శాంతి తిరుపతిలో లభించింది
  • నా సహాయం ఇక్కడి నుంచే మొదలవుతుంది
  • సినీ, రాజకీయ జీవితంపై తీర్మానాలు వద్దన్న మనోజ్

రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు ఓ లేఖ ద్వారా వెల్లడించిన మంచు మనోజ్, కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. "రాయలసీమకు వస్తున్న... రాగి సంగటి, మటన్ పులుసు రెడీగా పెట్టండి" అంటూ లేఖను ముగించిన ఆయన, అంతకుముందు తన మనసులోని మాటలు పంచుకున్నాడు.

 "ప్రపంచం మొత్తం తిరిగాను. అన్ని జాతులు, మతాలు, కులాల ప్రజల్ని కలిశాను. ఒక్క చిన్న బ్రెడ్ ముక్క కోసం గ్యారేజీల్లో పనిచేసే వాళ్లను చూశాను. ఎన్నో సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాను. స్నేహితుల కోరిక మేరకు కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించాను. అన్నీ సంతృప్తితో చేశాను. నా చుట్టూ ఉండే ప్రజల సంతోషం కోసమే చేశాను. ప్రపంచంలోని ప్రతి దిక్కూ తిరిగాను. దేశంలోని ప్రతి మూలా చూశాను. ఆ దేవుడు సృష్టించిన ఈ ప్రపంచం అద్భుతం, అమోఘం.నేను కోరుకునే మనశ్శాంతి నాకు తిరుపతిలో దొరికిందని కచ్చితంగా చెప్పగలను. నేను పెరిగిన ప్రదేశం, నా ఎదుగుదలకు కారణమైన ప్రదేశం ఇది. స్వేచ్ఛగా ప్రపంచానికి రెక్కలు విప్పుకుని ఎగిరేలా చేసింది ఈ ప్రదేశం. అణువణువూ ధైవత్వంతో నిండివున్న ఈ తిరుపతి గాలి పీల్చినప్పుడు ఏదో తెలీని పవర్, మరేదో తెలియని శక్తి నన్ను ఆవహిస్తుంది. ఇక్కడి రైతుల పిల్లలు విద్యను పొందడంలో సహాయం చేస్తాను.

తిరుపతి నుంచి మొదలయ్యే ఈ సహాయం ప్రపంచమంతా చేరువ అయ్యేలా తపిస్తాను. ముందుగా ఇక్కడి యువతకు సహాయపడేలా ఏదైనా చేస్తాను. నా వల్ల లోకానికి కలిగే ప్రయోజనం ఏంటో వెతికే క్రమంలో కొన్ని నెలల నిమిత్తం తిరుపతికి షిఫ్ట్ అవుతున్నాను. రాయలసీమలో ప్రారంభించే ఈ సరికొత్త ప్రయాణం ఇక్కడికే పరిమితం కాదు. నా సినీ, రాజకీయ జీవితంపై ఎవరూ ఎలాంటి తీర్మానాలు చేయవద్దు. సినిమాలపై నాకున్న ఆసక్తి ఎప్పుడూ తగ్గదు. విలక్షణ పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాలనే దాహం ఎన్నటికీ తీరదు. నా జీవితాన్ని ఈ నేల యువతకు అంకితం చేస్తున్నాను.

రాయలసీమకు వస్తున్నా... రాగి సంగటి, మటన్ పులుసు రెడీగా పెట్టండి" అని ఆయన లేఖ రాశాడు.

  • Loading...

More Telugu News