Sabarimala: అయ్యప్ప భక్తుల టార్గెట్ విలేకరులే... వెంటనే వెళ్లిపోవాలని పోలీసుల హెచ్చరికలు!
- గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆందోళనలు
- ఆలయంలోనే మకాం వేసిన 1000 మంది
- చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చంటూ పోలీసుల హెచ్చరికలు
గడచిన నాలుగు రోజులుగా శబరిమలలో ఆడవాళ్ల ప్రవేశాన్ని అడ్డుకుంటూ ఉవ్వెత్తున లేస్తున్న నిరసనలు, నేడు హింసాత్మకంగా మారవచ్చని, ఈ క్రమంలో మీడియా వాహనాలు, విలేకరులపై దాడులకు అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. శబరిమల, పంబ ప్రాంతాల నుంచి మీడియా వారంతా వెళ్లిపోవాలని, భక్తులకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని పోలీసులు కోరారు.
సంప్రదాయాలకు విఘాతం కలిగించే చర్యలు ఏవైనా జరిగితే, ఆలయానికి తాళాలు వేస్తామని ప్రభుత్వానికి ఆలయ పూజారులు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆలయం వద్ద మకాం వేసిన దాదాపు 1000 మంది, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని భావిస్తున్నారని, 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు ఎవరు వచ్చినా, వారిని అడ్డుకోవాలని భావిస్తున్నారని, వీరిని ఆలయం మూసివేత తరువాత, అక్కడి నుంచి తరలిస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆలయంలో మకాంవేసిన వారంతా బీజేపీ కార్యకర్తలేనని ప్రచారం సాగుతుండటాన్ని ఆ పార్టీ ఖండించింది. తామెవరినీ ఆలయంలో మోహరించలేదని, సమస్య పరిష్కారానికి వెంటనే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని డిమాండ్ చేసింది.
నేడు భారీ ర్యాలీని నిర్వహించనున్నట్టు స్పష్టం చేసిన కేరళ బీజేపీ కార్యదర్శి, శబరిమల అయ్యప్ప సంరక్షణ అభియాన్ నేత కే సురేంద్రన్, తమ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి, శబరిమల ప్రాముఖ్యతను, దాని పవిత్రతను కాపాడాల్సిన ఆవశ్యకతను గురించి ప్రచారం చేస్తారని అన్నారు.