Amruta Fadnvis: తొలి క్రూయిజ్ నౌక ఆంగ్రియాను ప్రారంభించిన గడ్కరీ.. పోలీసులను వణికించిన సీఎం శ్రీమతి!
- ముంబై-గోవా మధ్య ప్రారంభమైన తొలి స్వదేశీ తయారీ నౌక
- కార్యక్రమానికి హాజరైన ఫడ్నవిస్ భార్య అమృత
- నౌక చివరి భాగానికి చేరుకుని సెల్ఫీలు
ముంబై-గోవా మధ్య తొలి స్వదేశీ తయారీ క్రూయిజ్ నౌక ఆంగ్రియా నిన్న తన పయనాన్ని ప్రారంభించింది. రెండు రెస్టారెంట్లు, ఆరు బార్లు, ఓ స్విమ్మింగ్ పూల్, డిస్కోథెక్, రీడింగ్ రూమ్, స్పా ఉన్న ఈ నౌకలో మొత్తం 104 గదులు ఉన్నాయి. 400 మంది ప్రయాణించే వీలుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జెండా ఊపి ప్రారంభించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్ పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. భద్రతా పరిధిని దాటి వెళ్లిన అమృత నౌక చివరి భాగానికి చేరుకుని కూర్చున్నారు. అక్కడ సెల్ఫీలు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది వణికిపోయారు. వెనక్కి రావాలని, జాగ్రత్తగా ఉండాలంటూ భద్రతా సిబ్బంది హెచ్చరిస్తున్నా ఆమె పట్టించుకోకుండా సెల్ఫీలు దిగారు. అనంతరం వెనక్కి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.