amritsar: జనాల మీద నుంచి రైలు దూసుకొచ్చిందని తెలుసు.. అయినా ముందుకు ఎందుకు వెళ్లానంటే...!: రైలు డ్రైవర్
- ట్రాక్ పై జనాలు ఉన్నట్టు గమనించి ఎమర్జెన్సీ బ్రేక్ వేశా
- రైలు ఆగుతున్న సమయానికి జనాలు రాళ్లు రువ్వడం ప్రారంభించారు
- దీంతో, ప్రయాణికుల భద్రత కోసం రైలును ముందుకు పోనిచ్చాను
పంజాబ్ లోని అమృత్ సర్ లో దసరా సంరద్భంగా నిర్వహించిన రావణ దహన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న జనాలపై నుంచి రైలు దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై అప్పుడు రైలును నడుపుతున్న డ్రైవర్ స్పందించాడు. జనాలపై నుంచి రైలు దూసుకొచ్చిందనే విషయం తనకు తెలుసని... లోపల ఉన్న ప్రయాణికుల ప్రాణాలను కాపాడటానికే రైలును ముందుకు పోనిచ్చానని చెప్పాడు.
'ట్రాక్ పై జనాలు ఉన్నట్టు గమనించా. వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వేశా. హారన్ కొడుతూనే ఉన్నా. అయినప్పటికీ కొందరు రైలు కింద నలిగిపోయారు. రైలు ఆగిపోతున్న సమయానికి జనాలు రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైలును మళ్లీ ముందుకు పోనిచ్చాను' అంటూ డ్రైవర్ తెలిపాడు. మరోవైపు, ఈ ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ తప్పు లేదని రైల్వే అధికారులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి జనాలే కారణమని వారు చెప్పారు.