Telangana: కాంగ్రెస్ సామాజిక న్యాయం... గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు 30 శాతం సీట్లు!
- తెలంగాణలో 57 శాతం బీసీల జనాభా
- 34 స్థానాలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్
- ఒక్కో ఎంపీ స్థానంలో రెండు బీసీ అసెంబ్లీ సీట్లు, కొన్నింట మూడు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, టీజేఎస్ తదితర పార్టీలతో జతకట్టి, మహాకూటమిని ఏర్పాటు చేసిన కాంగ్రెస్, విజయం కోసం వ్యూహాలు పన్నుతోంది. తెలంగాణ జనాభాలో 57 శాతం ఉన్న బడుగుల ఓట్లపై కన్నేసిన కాంగ్రెస్, 30 శాతం టికెట్లు బీసీలకే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పేర్లను తయారు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి టీపీసీసీ నేతలకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. బీసీలకు మొత్తం 34 సీట్లు ఇవ్వాలని తాము నిర్ణయించామని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.
ఆపై మాదిగలకు 12, మాలలకు 7, లంబాడీలకు 6, ఆదివాసీలకు 6 టికెట్లు ఇవ్వాలని కూడా భావిస్తున్నామని చెప్పారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు బీసీలకు టికెట్ ఇవ్వాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు వెల్లడించారు. ఒక పార్లమెంట్ స్థానంలో రిజర్వేషన్ సమస్యల కారణంగా బీసీలకు కుదరకుంటే, మరో పార్లమెంట్ నియోజకవర్గంలో అధిక సీట్లను బీసీలకు కేటాయిస్తామని టీపీసీసీ చెబుతోంది. గతంలో ఎన్నడూ బీసీలకు 30 శాతం సీట్లను ఇవ్వలేదని, బడుగుల అభ్యన్నతికి కాంగ్రెస్ కట్టుబడివుందని చెప్పడానికి ఇప్పుడిస్తున్న సీట్ల సంఖ్యే నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు.