weather: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... వర్షాలు కురిసే అవకాశం
- గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ ఉపరితల ఆవర్తన ప్రభావం
- రెండు రోజుల్లో బలపడుతుందని అంచనా
- నైరుతి నిష్క్రమణ, ఈశాన్య రుతుపవనాల రాకకు వేళాయే
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోంది. ఇది రెండు రోజుల్లో బలపడే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో ఆవరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం నాటికి అల్పపీడం ఏర్పడింది. దీనివల్ల రానున్న 24 గంటల్లో కోస్తా, రాయల సీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి బంగాళాఖాతం, కర్ణాటక, కేరళలోని ఆవర్తనల ప్రభావంతో ప్రస్తుతం తేమ గాలులు వీస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి సమయం ఆసన్నమైందని, ఆదివారం నాటికి నైరుతి పూర్తిగా నిష్క్రమించవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.