Rahul Gandhi: రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్!
- అంబేద్కర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ గుర్తించలేదు
- కాంగ్రెస్ అసమర్థ పాలనతోనే రైతు సమస్యలు ఉత్పన్నమయ్యాయి
- కాంగ్రెస్ హయాంలోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారు
అంబేద్కర్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు గౌరవం లేదని... ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరును కూడా తొలగించారంటూ కాంగ్రెస్ అధినేత చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆదిలాబాద్ జిల్లాలో అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని... ఈ విషయాన్ని రాహుల్ గాంధీ తెలుసుకోవాలని సూచించారు. ఈ రకమైన విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ గుర్తించలేదని... భారతరత్న ఇవ్వడానికి కూడా నిరాకరించిందని... వీపీ సింగ్ ప్రభుత్వం అంబేద్కర్ ను భారతరత్నతో గౌరవించిందని తెలిపారు. తెలుగుబిడ్డ పీవీ నరసింహారావును కాంగ్రెస్ పెద్దలు ఏ విధంగా అవమానించారో ఎవరూ మర్చిపోలేరని అన్నారు.
రైతుల ఆత్మహత్యలపై మాట్లాడిన రాహుల్ సిగ్గుపడాలని... 50 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనతోనే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 17 వేల కోట్ల నుంచి రూ. 40 వేల కోట్లకు పెంచారని చెప్పారు. ప్రాణహిత, కాళేశ్వరం ఖర్చు రూ. 80 వేల కోట్లని కేంద్ర జల సంఘమే చెప్పిందని తెలిపారు. 2013 భూసేకరణ చట్టం తర్వాత పరిహారం భారీగా పెరిగిందని చెప్పారు.