Rahul Gandhi: భైంసా సభలో కేసీఆర్ ను ఎండగట్టిన రాహుల్ గాంధీ
- కేసీఆర్ కుటుంబం తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడింది
- తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది
- అంబేద్కర్ పేరు ఎత్తడం కూడా కేసీఆర్ కు ఇష్టం లేదు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుటుంబం తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడిందని... కోట్ల రూపాయలను దండుకుందని విమర్శించారు. ప్రాజెక్టుల పేరు మార్చి, ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. రీడిజైన్ల పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ప్రతి రంగంలో అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కేవలం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు మాత్రమే బాగుపడ్డారని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగిస్తూ ఆయన ఈ మేరకు విమర్శలు గుప్పించారు.
గిరిజనులు, ఆదివాసీల సంక్షేమం కోసం యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను పక్కన పెట్టేశారని మండిపడ్డారు. అందరూ అంబేద్కర్ సిద్ధాంతాలను పాటిస్తుంటే... కేసీఆర్ కు ఆయన పేరు ఎత్తడం కూడా ఇష్టం లేదని అన్నారు. ఏ ఒక్క పథకానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టలేదని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామన్న కేసీఆర్... వాటిని ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారని... ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కేసీఆర్ లు ఎక్కడకు వెళ్లినా అబద్ధాలే చెబుతారని అన్నారు. రైతులకు సరైన ధర ఇవ్వకుండా, వారి భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు.