Bihar: మసాజ్ చేయించుకుంటూ ఫిర్యాదు స్వీకరిస్తున్న ఏఎస్సై.. పరువు తీశాడంటూ వేటు!
- పోలీస్ స్టేషన్‌లో బాడీ మసాజ్
- బూతులు తిడుతూ ఫిర్యాదు స్వీకరించిన ఏఎస్సై
- సస్పెన్షన్ వేటేసిన ఎస్పీ
పోలీస్ స్టేషన్‌లో బాడీ మసాజ్ చేయించుకుంటూ బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరిస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై)పై వేటుపడింది. అతడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బీహార్‌లోని కైమూర్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. మసాజ్ చేయించుకుంటూ, ఫిర్యాదుదారులను బూతులు తిడుతున్న ఏఎస్సై వీడియో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు.
ఏఎస్సై వెనక నిలబడిన ఓ వ్యక్తి అతనికి మసాజ్ చేస్తుంటే అతడు నిర్లక్ష్యంగా బాధితుల ఫిర్యాదు వింటున్నాడు. అంతేకాక, మధ్యమధ్యలో వారిని బూతులు తిడుతుండడం కూడా వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో దీనినే ఫిర్యాదుగా స్వీకరించిన అధికారులు దర్యాప్తు జరిపారు. ఏఎస్సైని జాఫర్ ఇమామ్‌గా గుర్తించిన కూమూర్ ఎస్పీ అతడిని సస్పెండ్ చేశారు. ఏఎస్సై తన తీరుతో పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చారని డీఎస్పీ అజయ్ ప్రసాద్ పేర్కొన్నారు.