currency: హైదరాబాదుకు తరలిస్తున్న రూ. 10 కోట్ల నగదు స్వాధీనం
- ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో పోలీసుల వాహన తనిఖీలు
- పిప్పరివాడ టోల్ ప్లాజా వద్ద కారులో నగదు గుర్తింపు
- మహారాష్ట్ర నుంచి హైదరాబాదుకు నగదు తరలింపు
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహనాలను తనిఖీ చేస్తూ, నగదు అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చేపట్టిన తనిఖీల్లో ఏకంగా రూ. 10 కోట్లను గుర్తించారు. పిప్పరివాడ టోల్ ప్లాజా వద్ద ఓ కారులో ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్ర నాగ్ పూర్ జిల్లా నుంచి హైదరాబాదుకు ఈ నగదును తరలిస్తున్నట్టు గుర్తించారు. కారు కర్ణాటక రిజిస్ట్రేషన్ తో ఉంది. నగదు మొత్తం రూ. 500 నోట్ల కట్టల రూపంలో ఉంది. ఈ నేపథ్యంలో కారు డ్రైవర్ సర్వేశ్, వినోద్ శెట్టిలను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న వెంటనే రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో సూర్యనారాయణ, డీఎస్పీలకు సమాచారం ఇచ్చారు. నిందితులను రేపు కోర్టులో హాజరుపరచనున్నారు.