ram gopal varma: ఎన్టీఆర్ అభిమానుల కోసం వర్మ బహిరంగ ప్రకటన.. కీలక వ్యాఖ్యలతో ఆడియో విడుదల

  • ఎంతో మందిని ఇంటర్వూ చేశా
  • కళ్లు బైర్లు కమ్మే నిజాలను తవ్వి బయటకు తీశా
  • లక్ష్మీపార్వతిని అవమానిస్తే.. ఎన్టీఆర్ ను అవమానించినట్టే

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని తెరకెక్కించనున్న నేపథ్యంలో... ఎన్టీఆర్ అభిమానుల కోసం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ బహిరంగ ప్రకటన చేశారు. కీలక వ్యాఖ్యలతో కూడిన ఓ ఆడియోను విడుదల చేశారు. ఆడియో సారాంశం ఆయన మాటల్లోనే.

ఎన్టీఆర్ అభిమానులకు నా బహిరంగ ప్రకటన. సినిమా అనే దానికి సరైన నిర్వచనం... జీవితానికి అర్థం పట్టడం. జీవితానికి అర్థం నిజంగా జీవించడం. నిజానికి నిజంగా జీవించే వారికి మరణమనేదే ఉండదు. అలాంటి వారు భౌతికంగా మరణించినా వారిని ప్రేమించే వారి గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. ఎన్టీఆర్ జీవితంపై తాను సినిమా తీయడానికి ముఖ్య కారణం ఆయన జీవితంలో కొన్ని భావోద్వేగమైన ఘట్టాలు ఉండటమే. వాటిలో అత్యంత ప్రధానమైనది ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత సంభవించిన అత్యంత విపత్కరమైన పరిణామాలు. అందుకే ఈ సినిమాకు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే పేరు పెట్టడం జరిగింది.

'లక్ష్మీస్ ఎన్టీఆర్'ను కేవలం ఒక సినిమా అనడం సినీ కళామతల్లిని, ఎన్టీఆర్ గారిని అవమానించినట్టే. లక్ష్మీపార్వతి గురించి నాకు ఎంతో మంది వేర్వేరు అభిప్రాయాలు, ఉదంతాలు చెప్పారు. వాళ్లు తెలిసి చెప్పారో, తెలియక చెప్పారో లేక ఏదైనా అజెండాతో చెప్పారో... రకరకాల కారణాలు ఉండవచ్చు. కానీ, వాదించడానికి వీలు లేనటువంటి ఒక నగ్న సత్యం ఏమిటంటే... ఎన్టీఆర్ చనిపోయే కొన్ని రోజుల ముందు ఓ ఇంటర్వ్యూలో ఆమె గురించి ఎనలేని గౌరవంతో మాట్లాడారు. అందువల్ల ఆమెను అనుమానించినా, అవమానించినా... సాక్షాత్తు ఎన్టీఆర్ గారిని అనుమానించి, అవమానించినట్టే.

నేను గుడ్డిగా ఏ పనీ చేయడం లేదు. లక్ష్మీపార్వతితో పాటు ఆమె ఇంట్లో అప్పుడు ఉన్న పని మనుషులు, స్టాఫ్, శత్రువులను కూడా ఇంటర్వ్యూ చేశా. కళ్లు బైర్లు కమ్మే నిజాలను లోతుగా తవ్వి బయటకు తీశా. నేను ఈ సినిమాను లక్ష్మీ గారి గురించి తీయడం లేదు. ఎన్టీఆర్ గారి గురించి తీస్తున్నా. ఆయన మీద గౌరవాన్ని ఆమె మీద చూపించడం అభిమానుల కనీస బాధ్యత. ఆమెను ఈ సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా పిలవడానికి ఒకే ఒక కారణం ఆమె ఎన్టీఆర్ భార్య అనే గౌరవం. సినిమా టైటిల్ ను బట్టి అందరికీ అర్థమయ్యే విషయం... సినిమాలో ఆమెది చాలా ముఖ్యమైన పాత్ర.

పరమ నాస్తికుడినైన నేను నా జీవితంలోనే మొట్టమొదటిసారి తిరుమల వెంకన్నకు పూజ చేశా. ఇదంతా ఎన్టీఆర్ పై నాకు హిమాలయాలపై ఉన్నంత గౌరవంతోనే చేశా. జరిగిన సంఘటనలను నిరూపించే విధంగానే సినిమా ఉంటుందని చెప్పగలను. జనవరి 24న విడుదల కానున్న ఈ సినిమా వెనుక ఎటువంటి రాజకీయ కారణాలు లేవని చెప్పినా నమ్మరు కనుక చెప్పను. కానీ, లేనివి ఉన్నట్టు చూపించి, మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేయబోనని మాత్రం ఎన్టీఆర్ సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నా. నా మాటను ఎవరు నమ్మినా, నమ్మకపోయినా... కచ్చితమైన నిజం మాత్రం... ఎవరు ఎన్టీఆర్ పేరు మీద సినిమా తీసినా... స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ఆశీస్సులు మాత్రం మా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు మాత్రమే ఉంటాయని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలను. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News