mumbai: హెచ్‌ఐవీ బాధితురాలి విడుదలకు అంగీకరించని కోర్టు!
- షెల్టర్ హోంలోనే ఉంచాలని ఆదేశాలు
- వ్యభిచారం వృత్తిగా స్వీకరించిన మహిళ
- ఆమె బయటకు వెళితే వ్యాధి వ్యాపింపజేస్తుందని జడ్జి తీర్పు
‘ఆమెకు వ్యభిచారమే జీవనాధారం. ఇన్నాళ్లు అదే చేసింది. ఒకవేళ ఇప్పుడు బయటకు వెళ్లినా ఆమె అదే వృత్తిని కొనసాగించదని నమ్మకం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అందువల్ల ఆమెను కట్టడి చేయడమే ఉత్తమం. లేదంటే మరికొందరు బాధితులుగా మారే ప్రమాదం ఉంది. ఆమెను షెల్టర్ హోంకే పరిమితం చేయండి’ అని హెచ్‌ఐవీ బాధితురాలైన ఓ మహిళ విడుదల విషయమై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ఇది.
వివరాల్లోకి వెళితే...ముంబయి, గిర్గాంలోని వీపీ రోడ్డులో హెచ్‌ఐవీ (ఎయిడ్స్) బాధితురాలైన ఓ వివాహిత (29) వ్యభిచారం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితురాలిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా షెల్టర్ హోంకు తరలించాలని కోర్టు ఆదేశించింది. అయితే తాను వివాహితనని, పైగా ఎయిడ్స్ బాధితురాలినని, ఎంతో ఆప్యాయంగా చూసే తన కుటుంబ సభ్యులు తాను బయటకు వెళితే వైద్యం చేయిస్తారని, అందువల్ల షెల్టర్ హోం నుంచి విడుదల చేయాలని సదరు మహిళ న్యాయమూర్తిని వేడుకుంది.
అయితే ఆమె కుటుంబ సభ్యులు ఆమె వాంగ్మూలానికి వ్యతిరేక వాదన వినిపించారు. ఆమెను బయటకు విడుదల చేస్తే మళ్లీ వ్యభిచార వృత్తిలోకే వెళ్తుందని కోర్టుకు తెలియజేశారు. దీనివల్ల ఆమె వద్దకు వచ్చే విటులు కూడా ఎయిడ్స్ బారిన పడే ప్రమాదం ఉందని, ఆమె వల్ల రోగం విస్తరించే ప్రమాదం ఉందని సదరు మహిళ కుటుంబ సభ్యులు కోర్టుకు విన్నవించారు.
ఈ వాదనలన్నీ విన్న న్యాయమూర్తి ఆమె బయటకు వెళితే, మళ్లీ వ్యభిచార వృత్తిలోకి దిగితే కుటుంబ సభ్యులు చెప్పినట్టే మరింత మంది ప్రమాదకరమైన రోగం బారిన పడే అవకాశం ఉందని, అందువల్ల ఆమె షెల్టర్ హోంకే పరిమితం కావడం మంచిదని భావించారు. దీంతో రోగ బాధితురాలిని కుటుంబ సభ్యుల సూచన మేరకు షెల్టర్ హోంలోనే ఉంచాలని అదనపు సెషన్స్ జడ్జి ఆర్.ఎం.సంద్రాణి ఆదేశాలు జారీ చేశారు.