dog park: గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త పార్కు.. శునకాలకు ప్రత్యేకం!
- పెంపుడు జంతువుల మానసికోల్లాసం కోసం వినూత్న ఆలోచన
- ఇప్పటికే కుక్కల కోసం ప్రత్యేక శ్మశానం ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ
- ప్రారంభోత్సవం రోజే ఉద్యానవనానికి మంచి ఆదరణ
కుక్క (శునకం) విశ్వాసం గలది. అందుకే చాలా కుటుంబాల్లో అదో భాగం. కుటుంబ సభ్యులతోనే దానికి ఆటా, పాటా, వినోదం. అయితే అన్ని సందర్భాల్లోనూ శునకాన్ని వెనకేసుకు తిరగలేం. ముఖ్యంగా జనం మధ్యకు శునకంతో వెళితే భద్రతాపరమైన ఇబ్బందుల వల్ల అనుమతించరు. మనుషులుగా మనమైతే ఏ పార్క్‌కో వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. మరి శునకాల సంగతి ఏమిటి? అందుకే శునకం పట్ల తన ‘విశ్వాసాన్ని’ చాటుకుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ).
మనుషులతో ఎంతో విశ్వాసంగా ఉండే శునకాల కోసం ఏదైనా వినూత్నంగా చేయాలనుకుని ఆలోచించింది. ఇందులో భాగంగా శునకాల ఉద్యానవనంను అందుబాటులోకి తెచ్చింది. కొండాపూర్‌లో ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేసింది. ఈ పార్క్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ పెంపుడు జంతువులతో ఈ పార్క్‌లో ఉల్లాసంగా గడపొచ్చు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శునకాల కోసం ప్రత్యేక శ్మశానాన్ని ఏర్పాటు చేసింది.
తాజాగా వాటి మానసిక ఉల్లాసం కోసం ఉద్యానవనాన్ని రూపొందించింది. పార్క్ ప్రారంభోత్సవం రోజే నగర వాసుల్లో చాలా ఉత్సాహం కనిపించింది. ఎందరో తమ పెంపుడు శునకాలతో పార్కుకు వచ్చి ఉల్లాసంగా గడపడం కనిపించింది. పలువురు సెల్ఫీలు తీసుకుంటూ బిజీగా కనిపించారు.