Sabarimala: వీవీఐపీలను మించిన బందోబస్తు మధ్య... చరిత్ర సృష్టించేందుకు శబరిమల కొండ ఎక్కుతున్న ఇద్దరు యువతులు!
- నడక ప్రారంభించిన ఇద్దరు యువతులు
- కొచ్చికి చెందిన కవిత, హైదరాబాద్ మోజో టీవీ జర్నలిస్టు
- భద్రతా ఏర్పాట్లు స్వయంగా చూస్తున్న ఐజీ
- అడుగడుగునా నిరసనల మధ్య నడక
ఏ వయసు వారైనా శబరిమలలోని అయ్యప్పను దర్శించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కేరళలో నిరసనలు మిన్నంటగా, అయ్యప్ప ఆలయం రెండు రోజుల క్రితం మాసపూజల నిమిత్తం తెరచుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి పలువురు రుతుస్రావ వయస్సు పరిధిలో ఉన్న మహిళలు, యువతులు అలయం వద్దకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కానీ, నేటి ఉదయం మాత్రం కనీవినీ ఎరుగని రీతిలో వీవీఐపీ భద్రత మధ్య ఇద్దరు యువతులు నీలక్కల్, పంబను దాటి ఆలయం దిశగా సాగుతున్నారు. వీరికి నిరసనకారుల నుంచి భద్రతను కల్పించేందుకు వందలాది మంది పోలీసులు బారులు తీరినట్టు తెలుస్తోంది.
ఈ ఉదయం కొచ్చికి చెందిన కవిత అనే మహిళతో పాటు, హైదరాబాద్ మోజో టీవీకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు భారీ భద్రత మధ్య సన్నిధానానికి నడక ప్రారంభించారు. ఒకవేళ వీరిద్దరూ ఆలయం వరకూ చేరుకుని, 18 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుంటే చరిత్ర సృష్టించినట్టే. వీరికి భద్రత కల్పించి, ఆలయం వద్దకు చేర్చే బాధ్యతలను సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఐజీ శ్రీజిత్ చేపట్టారు. వీరిని అడ్డుకునేందుకు అయ్యప్ప భక్తులు అడుగడుగునా ప్రయత్నిస్తున్నారని, పోలీసులు వారిని ఎక్కడికక్కడ చెదరగొడుతూ, ఇద్దరినీ 4.6 కిలోమీటర్లున్న నడక మార్గంలో తీసుకెళుతున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.