BJP: పరిపూర్ణానందను వెంటనే ఢిల్లీకి రావాలని కోరిన అమిత్ షా!
- బీజేపీ అధిష్ఠానం నుంచి పిలుపు
- ప్రధాని నరేంద్ర మోదీతో కూడా సమావేశం
- బీజేపీ ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశం
తెలంగాణలో ఎన్నికలు దగ్గరైన వేళ, శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందకు మరోసారి బీజేపీ అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. ఢిల్లీకి వచ్చి తనను కలుసుకోవాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా పరిపూర్ణానంద సమావేశం అవుతారని, ఆ తరువాత ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రచార బాధ్యతల సారధిగా ఆయన్ను నియమించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.
కాగా, పది రోజుల క్రితం అమిత్ షాతో పరిపూర్ణానంద సమావేశమైన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్ధిగా పరిపూర్ణానందను ప్రకటించే అవకాశాలున్నాయన్న ప్రచారమూ జరుగుతోంది. అమిత్ షా ఆదేశాల మేరకు తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని పరిపూర్ణానంద వ్యాఖ్యానించడం గమనార్హం. దసరా తరువాత మళ్లీ కలుద్దామని అమిత్ షా చెప్పడం, మరోసారి పిలుపు రావడంతో నేడు లేదా రేపు పరిపూర్ణానంద న్యూఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది.