Chandrababu: ఆయనొచ్చి పనిచూసుకుని వెళ్లారు.. ఈయనేమో ముద్దుల్లో బిజీ.. మరొకరు ఏం మాట్లాడతారో తెలియదు: చంద్రబాబు
- రాజ్‌నాథ్, జగన్, పవన్‌పై విరుచుకుపడిన చంద్రబాబు
- ముద్దులతో బిజీగా ఉన్న జగన్‌కు బాధితులను పరామర్శించే తీరిక లేదు
- అంతా అయ్యాక పవన్ వచ్చారు
శ్రీకాకుళం జిల్లాలోని తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బీజేపీ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. పక్క జిల్లాలోని ప్రజలకు ముద్దులు పెడుతూ పాదయాత్రతో బిజీగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి గంట దూరంలో ఉన్న శ్రీకాకుళం వచ్చి తుపాను బాధితులను పరామర్శించేంత తీరిక లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అయిపోదామా అని ఎదురుచూస్తున్న ఆయనకు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే సమయం ఉంటుందని, కానీ తుపానుతో అల్లాడిపోతున్న ప్రజలను పరామర్శించే తీరిక లేకుండా పోయిందని మండిపడ్డారు.
గుంటూరు వచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్కడ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించి, తనను విమర్శించి వెళ్లపోయారని, తుపాను బాధితులను పరామర్శించేందుకు మాత్రం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, అంతా అయిపోయాక పవన్ వచ్చి పరామర్శించి వెళ్లారని ఎద్దేవా చేశారు. పవన్ ఏం మాట్లాడుతున్నారో, తనను ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అండగా ఉండాల్సిన కేంద్రం ఏపీపై దాడులు చేయిస్తూ ప్రభుత్వాన్ని భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోందని, కానీ కేంద్రం పప్పులు ఇక్కడ ఉడకవని చంద్రబాబు తేల్చి చెప్పారు.