RJD: ఆర్జేడీ పోస్టర్ వార్.. రాముడిగా తేజస్వీ యాదవ్, రావణుడిగా సీఎం!
- ఆకట్టుకుంటున్న పోస్టర్
- రాష్ట్ర ప్రజల మనోభావాలకు ఇది అద్దం పడుతోందన్న ఆర్జేడీ
- సముచితం కాదన్న కాంగ్రెస్
బీహార్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య పోస్టర్ వార్ నడుస్తోంది. దసరాను పురస్కరించుకుని ఆర్జేడీ ఏర్పాటు చేసిన పోస్టులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను రావణాసురుడిగా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను రాముడిగా పోలుస్తూ పాట్నాలోని ఆర్జేడీ కార్యాలయం బయట పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లపై ఆర్జేడీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవి ఫొటోలు కూడా ఉన్నాయి.
ఈ నెల 21 నుంచి తేజస్వీ యాదవ్ నాలుగో విడత ‘సంవిధాన్ బచావో న్యాయ్ యాత్ర’ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ కార్యకర్త ఆనంద్ ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు, ఈ పోస్టర్లపై ‘రావణాసురుడు అత్యాచారాలకు పాల్పడిన ప్రతిసారీ రాముడు పుడుతూనే ఉంటాడు’ అనే స్లోగన్‌ను కూడా ముద్రించారు.
ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తిసింగ్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌కు ఈ పోస్టర్ అద్దం పడుతోందని అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న అరాచకాలను తేజస్వీ అదుపు చేయగలడని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, ఆర్జేడీ భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం ఈ పోస్టర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటువంటి పోస్టర్లు తగదని పేర్కొంది. తేజస్వీ యాదవ్‌ను రాముడిగా అభివర్ణిస్తూ ఫొటో ముద్రించడం ఓకే కానీ, ముఖ్యమంత్రిని రావణుడిగా చూపించడం అనుచితమని ఆ పార్టీ ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ పేర్కొన్నారు.