pakistan: ప్రపంచమంతా మాకు థ్యాంక్స్ చెప్పాలి: పాకిస్థాన్ సైన్యం

  • ఉగ్రవాదంపై మేము పెద్ద యుద్ధమే చేస్తున్నాం
  • ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి ఎంతో కృషి చేస్తున్నాం
  • ఈ పోరు కోసం మాకు ఎంతో ఖర్చు అవుతోంది

ప్రపంచం మొత్తానికి తెలిసిన టెర్రరిస్టు హఫీజ్ సయీద్ తన అనుచరులను ఎన్నికల్లో నిటబెట్టిన ఘనత పాకిస్థాన్ ది. టెర్రరిజానికి అండగా నిలుస్తూ, ప్రపంచ శాంతికి పాక్ విఘాతం కలిగిస్తోంది. మరోవైపు, టెర్రిరిజంపై తాము ఉక్కుపాదం మోపుతున్నామని అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ నంగనాచి మాటలు చెబుతోంది. టెర్రరిజాన్ని అంతమొందించేందుకు తాము పెద్ద యుద్ధమే చేస్తున్నామని పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ అన్నారు.

బ్రిటన్ లోని వార్విక్ యూనివర్శిటీలో గఫూర్ ప్రసంగిస్తూ, భారత ఉపఖండంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి తాము ఎంతో కృషి చేస్తున్నామని చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో తాము చేస్తున్న కృషికి ప్రపంచమంతా తమకు ధన్యవాదాలు చెప్పాలని అన్నారు.

ఉగ్రవాదంపై పోరుకు తాము పెద్ద యుద్ధమే చేస్తున్నామని, దీనివల్ల తమకు ఎంతో ఖర్చు అవుతోందనే విషయాన్ని పాకిస్థాన్ గత కొంత కాలం నుంచి పలు సార్లు, పలు వేదికలపై లేవనెత్తుతోంది. అయితే, భారత్ లోకి టెర్రరిస్టులను ఎందుకు పంపుతున్నారనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. అమెరికా నిషేధిత లిస్టులో ఉన్న ఉగ్రవాది హఫీజ్ సయీద్ దేశ రాజకీయాల్లోకి ఎలా వస్తారనే ప్రశ్నకు కూడా సమాధానం దాటవేస్తోంది.

అమెరికా హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా హక్కానీ నెట్ వర్క్ కు పాక్ అండదండలు అందిస్తోంది. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు టెర్రరిస్టులు స్వాధీనం చేసుకుంటారేమోననే భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఓవైపు టెర్రరిజాన్ని ఇంతలా పోషిస్తున్న పాకిస్థాన్... మరోవైపు అంతర్జాతీయ వేదికలపై సన్నాయి నొక్కులు నొక్కుతుండటం... ఆ దేశ రెండు నాల్కల ధోరణిని బట్టబయలు చేస్తోంది.  

  • Loading...

More Telugu News