Sri reddy: శ్రీరెడ్డి వంటి వారి నుంచి కాపాడుకునేందుకే ‘మీ టూ మెన్’: తమిళ సినీ దర్శకుడు వారాహి
- శ్రీరెడ్డికి ఆదిలోనే నిరసనలు తెలిపాం
- ‘మీటూ’ని ఆసరాగా చేసుకుని బెదిరిస్తున్నారు
- అమాయకులను కాపాడేందుకే ‘మీ టూ మెన్’
సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘మీటూ’ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మహిళలు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. దీని బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ‘మీ టూ మెన్’ ఉద్యమాన్ని ప్రారంభించినట్టు తమిళ సినీ దర్శకుడు వారాహి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాలో పాత్ర కావాలంటే కమిట్ అవ్వాల్సిందే అంటూ శ్రీరెడ్డి టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వచ్చిందని.. ఆదిలోనే ఆమెకు నిరసన తెలిపామన్నారు.
శ్రీరెడ్డి వంటి వారెందరో ప్రముఖులపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని.. ఇలాంటి వారి బారి నుంచి అమాయకులైన పురుషులను కాపాడేందుకే ‘మీటూ మెన్’ ప్రారంభించామన్నారు. ఐదేళ్ల క్రితం పరస్పర అంగీకారంతో ఓ పారిశ్రామికవేత్తకు, ఓ సినిమా నటికీ మధ్య చోటు చేసుకున్న వ్యక్తిగత సంబంధానికి సంబంధించిన సంగతులను వెల్లడించకుండా ఉండాలంటే, తనకు రూ.3 కోట్లు ఇవ్వాలంటూ సదరు నటి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు ఆ పారిశ్రామికవేత్త తెలిపారని వారాహి పేర్కొన్నారు. ఇలాంటి వాటన్నింటినీ ఎదుర్కొనేందుకే ఈ ఉద్యమాన్ని ప్రారంభించానని వారాహి స్పష్టం చేశారు.