srilekha: నా పాట విని కాకి అరిచినట్టుగా వుందన్న బాలు గారితోనే ఫస్టు డ్యూయెట్ పాడాను: శ్రీలేఖ
- చిన్నప్పుడు 'శంకరాభరణం' చూశాను
- బాలూ గారు పాడారని తెలిసి ఆయన ఇంటికి వెళ్లాను
- ఆ తరువాత నన్ను ఆయన రికార్డింగ్ థియేటర్లో చూశారు
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న శ్రీలేఖ, ఒక ఆసక్తికరమైన సంఘటనను గురించి చెప్పుకొచ్చారు. "చిన్నప్పుడు 'శంకరాభరణం' సినిమా చూసిన తరువాత, శంకరశాస్త్రి గారే ఆ పాటలు పాడారని అనుకున్నాను. ఆ పాటలు పాడినది బాలూగారు అని నాన్నగారు చెప్పారు. బాలూ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్లమని నేను పట్టుపట్టడంతో మా నాన్నగారు తీసుకెళ్లారు.
'మా అమ్మాయి బాగా పాడుతుందండి' అని మా నాన్నగారు చెప్పగానే, 'ఏదమ్మా ఒక పాట పాడు' అని బాలూగారు అన్నారు. 'శంకరా బరము .. ' అంటూ రాగం తీశాను. వెంటనే ఆయన 'ఆపేయ్' అన్నారు. 'మీ అమ్మాయి గొంతు కాకి అరిచినట్టుగా ఉందండి' అన్నారు. అప్పుడు ఆయనకి ఒక లుక్ ఇచ్చా. ఆ తరువాత కొంత కాలానికి మొదటిసారిగా 'ఆయనకి ఇద్దరు' సినిమాలో 'అందాలమ్మో అందాలు .. ' అనే డ్యూయెట్ ను బాలూగారి తో కలిసి పాడాను.
ముందుగా నేను పాడినది రికార్డు చేశారు. అక్కడ నన్ను చూసిన బాలూగారు 'నువ్వేంటి ఇక్కడ?' అన్నారు. పాడించడానికి తీసుకొచ్చాను అని 'కోటి' గారు చెప్పారు. 'ఎందుకయ్యా ఇలాంటి పనులు చేస్తారూ .. ' అంటూ ఆయన లోపలికి వెళ్లారు. ఆయన పాడిన తరువాత పూర్తి పాటను విన్నారు. పాట విన్నాక నా వైపు తిరిగి ' కాకి .. కోకిల ఎప్పుడైంది' అంటూ మెచ్చుకున్నారు" అని చెప్పుకొచ్చారు.