Amazon: దుమ్ము దులిపిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్... 5 రోజుల్లో రూ. 15 వేల కోట్ల అమ్మకాలు!
- లక్షలాది ఉత్పత్తులను విక్రయానికి ఉంచిన ఆన్ లైన్ దిగ్గజాలు
- గత సంవత్సరంతో పోలిస్తే 64 శాతం పెరిగిన అమ్మకాలు
- పట్టణాల నుంచి పెరిగిన ఆర్డర్లు
ఈ దసరా - దీపావళి సీజన్ లో వివిధ రకాల ఆఫర్లు, బోనస్ లు, డిస్కౌంట్లు ప్రకటించిన ఆన్ లైన్ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు దుమ్ము దులిపాయి. ఐదు రోజుల వ్యవధిలో రూ. 15 వేల కోట్ల విలువైన లావాదేవీలు జరిపాయని తెలుస్తోంది. పెన్ డ్రైవ్ లు, స్మార్ట్ ఫోన్ల నుంచి దుస్తులు, గృహోపకరణాల వరకూ లక్షలాది ఉత్పత్తులను విక్రయానికి ఉంచిన కంపెనీలు, గత సంవత్సరం పండగ సీజన్ అమ్మకాలతో పోలిస్తే, వారం రోజులైనా కాకుండానే 64 శాతం అధిక విక్రయాలు సాగించాయి. గత సంవత్సరం రూ. 10,325 కోట్ల విక్రయాలను ఈ సంస్థలు సాగించగా, ఇప్పుడు అంతకుమించిన అమ్మకాలు జరిగాయి.
ఈ-కామర్స్ సంస్థల అమ్మకాల్లో స్మార్ట్ ఫోన్లు ఈ సంవత్సరం కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఈ ఏడాది నగరాలతో పోలిస్తే ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి ఆర్డర్లు బాగా వచ్చాయి. రిటైల్ స్టోర్లకు వెళ్లేవారు కూడా ఆన్ లైన్ పోర్టళ్లలో ఆర్డర్లు పెట్టారని 'రెడ్ సీర్' వెల్లడించింది. కాగా, తాము ఆఫర్ చేసిన 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్'లో భాగంగా, గత సంవత్సరం అమ్మకాలను 36 గంటల్లోనే అధిగమించామని, ఈ సంవత్సరం 90 శాతం విక్రయాలు చిన్న పట్టణాల నుంచే ఉన్నాయని అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేశీయ అధిపతి తెలిపారు. ఫ్యాషన్ దుస్తులు కూడా విరివిగా విక్రయించామన్నారు.
ఇదే సమయంలో దేశీయ రిటైల్ రంగంలో పాత రికార్డులను తుడిచిపెడుతూ 'బిగ్ బిలియన్ డేస్' విక్రయాలు సాగాయని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఈ నెల 9 నుంచి 14 తేదీల మధ్య జరిగిన ఆన్ లైన్ విక్రయాల్లో 70 శాతం వాటా తమదేనని, స్థూల అమ్మకపు విలువ 80 శాతం పెరిగిందని, యూనిట్ల పరంగా రెండు రెట్లు విక్రయించామని వెల్లడించింది. విక్రయించబడిన ప్రతి 4 స్మార్ట్ ఫోన్లలో మూడు తామే అమ్మామని తెలిపింది.