Bill Gates: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్ మృతి... గుండెను పిండేస్తోందన్న బిల్ గేట్స్!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-3f00114a56f60ecd144c8f685b67c5080272cfe8.jpg)
- సియాటెల్ ఆసుపత్రిలో మరణించిన పాల్
- బ్లడ్ క్యాన్సర్ తో బాధపడిన పాల్
- సంతాపం తెలిపిన బిల్ గేట్స్, సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్ కన్నుమూశారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధి హడ్కిన్స్ లింఫోమాతో బాధపడుతున్న ఆయన, సియాటెల్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆయన సొంత సంస్థ వుల్కాన్ ఐఎన్సీ పేర్కొంది. పర్యావరణం, స్పేస్ ట్రావెల్, కళలు, క్రీడారంగాలకు ఆయన తన ఆస్తిలో ఎంతో భాగాన్ని ఉదారంగా దానమిచ్చారు.
బిల్ గేట్స్ తో కలసి మైక్రోసాఫ్ట్ ను పాల్ అలెన్ స్థాపించిన సంగతి తెలిసిందే. పాల్ మృతి తన గుండెలను పిండేస్తోందని బిల్ గేట్స్ ఓ ప్రకటనలో తెలిపారు. తనకున్న చిరకాల, ఆప్త మిత్రుల్లో పాల్ ఒకడని, ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. పాల్ లేకుండా పర్సనల్ కంప్యూటింగ్ అన్న మాటే ఉత్పన్నమయ్యేది కాదని చెప్పారు. పాల్ మృతిపట్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సంతాపం వెలిబుచ్చారు. ఆయన్నుంచి తానెంతో నేర్చుకున్నానని చెప్పారు.