Doctor: ఆపరేషన్ చేశారు.. కడుపులో పైపు ఉంచేశారు!
- కడుపు నొప్పి వస్తోందని ఆసుపత్రికి వెళ్లిన జమున
- అపెండిసైటిస్ నొప్పిగా తేల్చిన వైద్యుడు
- శస్త్ర చికిత్స చేసి కడుపులో పైపును మరిచారు
వైద్యం కోసం వెళ్లిన ఓ యువతికి.. వైద్యుడు కడుపులోనే పైపును మరచి శస్త్ర చికిత్స చేశాడు. యువతికి కడుపు నొప్పి రావడంతో మళ్లీ ఆసుపత్రికి వెళితే, కడుపులో పైపు ఉందని మరోసారి ఉచితంగా శస్త్ర చికిత్స చేసి పైపును తొలగిస్తామని చెప్పారు. తీరా చేశాక డబ్బు కోసం వైద్యుడు గొడవకు దిగడంతో వివాదమైంది.
ఆ వివరాల్లోకి వెళితే, జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన బి. జమున కడుపునొప్పి వస్తోందని గత నెల 26న జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి రోడ్డులో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు, అది అపెండిసైటిస్ నొప్పిగా తేల్చి.. ఆపరేషన్ నిర్వహించారు.
ఈ నెల 1వ తేదీన డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిన జమునకు మళ్లీ కడుపునొప్పి రావడం ఆరంభమైంది. దీంతో మళ్లీ ఆమె అదే వైద్యుడిని సంప్రదించింది. స్కానింగ్ తీసిన వైద్యుడు ఆమె కడుపులో పైపు ఉన్నట్టు గుర్తించి పొరపాటును మన్నించాలని వేడుకున్నారు. వెంటనే జమునకు మళ్లీ శస్త్ర చికిత్స చేసి పైపును తొలగించారు.
ముందు ఉచితంగా ఆపరేషన్ చేస్తామన్న వైద్యుడు, అనంతరం రూ.5 వేలు ఫీజు చెల్లించాలంటూ దుర్భాషలాడటమే కాకుండా ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని జమున కుటుంబ సభ్యులను శాంతింప చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.