Pawan Kalyan: గూండాగిరి, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే ఊరుకోం: పవన్ కల్యాణ్ హెచ్చరిక

- చంద్రబాబు, జగన్ ని హెచ్చరించిన పవన్ కల్యాణ్
- ఇలాంటి రాజకీయాలు చేస్తే ప్రజలు ఊరుకోరు
- పద్ధతులు మారకపోతే వచ్చే ఎన్నికల్లో అనుభవిస్తారు
గూండాగిరి, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని చంద్రబాబు, జగన్ కు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ధవళేశ్వరంలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, ఈ తరహా రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజలు ఊరుకోరని, యువత తిరగబడితే ఎదురయ్యే పర్యవసానాలకు అధికార, ప్రతిపక్ష పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ పద్ధతులు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఫలితం అనుభవిస్తారని వాళ్లిద్దరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
ఈరోజుల్లో ‘హేరామ్’ అంటే కుదరదు
అన్నాహజారే, కేజ్రీవాల్ లా అంత పెద్దగా విలువల గురించి తాను చెప్పలేనని, దౌర్జన్యాలను అరికట్టాలంటే ముల్లును ముల్లుతోనే తీయాలని పవన్ అభిప్రాయపడ్డారు. దౌర్జన్యాలు చేసే వారి ముందు ‘హేరామ్’ అనో, ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనో అంటే కుదరదని, ఎవడూ వినేవాడు లేడని, ‘తాట తీస్తాం’ అంటే తప్ప మాట వినరని అన్నారు. గాంధీజీ, అంబేద్కర్ ను గౌరవించే దేశమా? మనదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహనీయులకు పూలదండలు వేయడం కాదని, వారి ఆశయాలను గౌరవించాలని సూచించారు.