New Delhi: మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై సహోద్యోగుల గ్యాంగ్ రేప్.. కారులో మత్తుమందు ఇచ్చి అఘాయిత్యం!
- ఇంటివద్ద డ్రాప్ చేస్తామంటూ దారుణం
- కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చిన సహోద్యోగులు
- నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
మహిళల రక్షణ, భద్రత కోసం అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మృగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. తాాజాగా ఓ మహిళా ఉద్యోగిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని నమ్మించిన ఇద్దరు వ్యక్తులు ఆమెకు మత్తుమందు ఇచ్చారు. అనంతరం తమ ఫ్లాట్ కు తీసుకెళ్లి బంధించి గ్యాంగ్ రేప్ చేశారు. చివరికి వీరి నుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. ఢిల్లీలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో బాధితురాలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె సహోద్యోగులు బిర్జూ(25), వినోద్ కుమార్(31)లు ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని నమ్మబలికారు. దీంతో బాధితురాలు వారి కారులో ఎక్కింది. ఈ సందర్భంగా నిందితులు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ను ఆమెకు అందించారు. కొద్దిసేపటికే స్పృహ కోల్పోవడంతో ఆమెను తమ ఫ్లాట్ కు తీసుకెళ్లి ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారు.
ఆదివారం ఉదయాన్నే స్పృహలోకి వచ్చిన బాధితురాలు, ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. అనంతరం తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అత్యాచారం జరిగినట్లు తేలింది.