Mumbai: 16 ఏళ్ల వయసులో రేప్ కేసు... 30 ఏళ్లు సాగిన విచారణ... చివరికి నిర్దోషి!
- 1988లో నమోదైన రేప్ కేసు
- ఆ తరువాత మారిన చట్టాలు
- సుదీర్ఘంగా సాగిన విచారణ
- సమ్మతితోనే నిందితుడితో వెళ్లానన్న అమ్మాయి
- ఇన్నేళ్లకు కేసు కొట్టివేత
దాదాపు 30 సంవత్సరాల పాటు సాగిన ఓ రేప్ కేసు విచారణ చివరకు ఓ కొలిక్కి వచ్చి, నిందితుడు నిర్దోషిగా బయటపడ్డాడు. ముంబై న్యాయ వర్గాల్లో ఆసక్తిని కలిగించిన కేసు పూర్వపరాల్లోకి వెళితే, 1988లో 16 సంవత్సరాల వయసున్న బాలుడు, 17 సంవత్సరాల వయసున్న అమ్మాయిపై అత్యాచారం చేశాడని, అమ్మాయి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
అప్పటి ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం) చట్టం ప్రకారం, కేసును ముంబై సెషన్స్ కోర్టు విచారించింది. ఈ కేసులో తాను ఇష్టపూర్వకంగానే అతనితో వెళ్లానని అమ్మాయి చెప్పడం, నాటి చట్టాల ప్రకారం, 16 ఏళ్లు దాటిన అమ్మాయి తనంతట తానుగా ఎవరినైనా కలిస్తే, దాన్ని రేప్ గా పరిగణించే అవకాశం లేకపోవడంతో, ప్రస్తుతం 46 ఏళ్ల వయసులో ఉన్న నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు.
జనవరి 23, 1988న తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ అమ్మాయి నిందితుడితో కలసి అతనింటికి వెళ్లింది. ఇంటికి వచ్చి చూసిన అమ్మాయి తండ్రి, తన కుమార్తె కోసం వెతుకుతున్న క్రమంలో నిందితుడి ఇంట్లో ఆమె కనిపించింది. తన కుమార్తెపై అతను రేప్ చేశాడని పోలీసులను ఆశ్రయించగా, అదే సంవత్సరం జనవరి 30న కేసు నమోదైంది. అయితే, తాను కావాలనే అతనితో వెళ్లానని అప్పట్లోనే ఆమె పోలీసులకు చెప్పినప్పటికీ, కిడ్నాప్, అత్యాచారం కేసులు పెట్టారు. ఆపై అత్యాచార నిర్వచనాలను సడలించడంతో కేసు విచారణ ఇన్ని సంవత్సరాలు కొనసాగింది.