Anantapur District: రైతన్నల కన్నెర్ర.. అనంతపురంలో విద్యుత్ సబ్ స్టేషన్ కు తాళం వేసి నిరసన!

  • విద్యుత్ కోతలపై ఆగ్రహం
  • నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్
  • రైతులతో పోలీసుల చర్చలు

పంటలు కాపాడుకోవడానికి పగలు, రాత్రి అన్న తేడా లేకుండా శ్రమిస్తుంటే, ఇష్టానుసారం విద్యుత్ సరఫరాను అధికారులు ఆపివేయడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో రైతులు విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించి, దానికి తాళం వేశారు. తమకు న్యాయం జరిగేవరకూ తాళం తీయబోమని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో ఈ రోజు చోటుచేసుకుంది.

జిల్లాలోని బెళుగుప్ప మండలం హనిమిరెడ్డి పల్లెలో విద్యుత్ శాఖ అధికారులు మాటిమాటికి సరఫరాను నిలిపివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం విద్యుత్ సబ్ స్టేషన్ కు చేరుకుని అధికారులను బయటకు తీసుకొచ్చారు. అనంతరం స్టేషన్ కు తాళం వేసి ధర్నాకు దిగారు. నిరంతరాయంగా విద్యుత్ ను సరఫరా చేసేవరకూ తాళం తీయబోమని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రైతులతో చర్చలు జరుపుతున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News