Vizag: రూ. 4.5 కోట్ల విలువైన బంగారం, రూ. 2.5 కోట్ల కరెన్సీ నోట్లతో విశాఖ కన్యకా పరమేశ్వరి ధగధగలు.. వీడియో చూడండి!
- విశాఖ కురుపాం మార్కెట్ ప్రాంతంలో ఆలయం
- బంగారు చీర, ఆభరణాలతో అమ్మకు అలంకరణ
- దర్శించుకునేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు
దేవీ నవరాత్రుల సందర్భంగా విశాఖపట్నంలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారిని బంగారం, కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించారు. దాదాపు రూ. 4.5 కోట్ల విలువైన బంగారం, రూ. 2.5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని, ఆలయాన్ని అందంగా అలంకరించారు. ప్రతి సంవత్సరమూ నవరాత్రుల్లో మహాలక్ష్మి అలంకారం సందర్భంగా ఈ తరహాలో అమ్మను అలంకరిస్తామని ఆలయ నిర్వహణ కమిటీ ప్రకటించింది. ఈ దేవాలయాన్ని 140 సంవత్సరాల క్రితం నిర్మించారని, నిత్యమూ ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు.
మహాలక్ష్మి అలంకరణ సందర్భంగా అమ్మవారికి బంగారు చీరతో పాటు, ఇతర ఆభరణాలను అలంకరించామని అన్నారు. సుమారు 200 మంది భక్తులు అలంకరణకు అవసరమైన బంగారం, నగదు అందించారని చెప్పారు. విశాఖపట్నంలోని కురుపాం మార్కెట్ ప్రాంతంలో ఈ ఆలయం ఉండగా, అమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.