Maharashtra: అమ్మాయి లిఫ్టు అడిగిందనుకుని ఆపితే... ఘోరంగా మోసపోయిన ప్రభుత్వ ఉద్యోగి!
- పుణెలో వీధుల్లో ఘటన
- రేప్ కేసు పెడతానని బెదిరింపు
- డబ్బు తీసుకుని ఉడాయించిన కిలేడీ
ఓ ప్రభుత్వ ఉద్యోగి బైకుపై వెళుతుంటే, లిఫ్ట్ అడిగి దారుణంగా మోసం చేసిన యువతి ఎవరో కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు పుణె పోలీసులు. మరిన్ని వివరాల్లోకి వెళితే, పుణెకు చెందిన దీపక్ దేశ్ ముఖ్ ప్రభుత్వ ఇంజనీరు. తన విధులను ముగించుకున్న అనంతరం రాత్రి పూట ఇంటికి వెళుతుండగా, స్థానిక అలంకార్ సినిమా థియేటర్ వద్ద సుమారు 30 సంవత్సరాల వయసున్న యువతి ఒంటరిగా నిలబడి లిఫ్ట్ అడిగింది.
అమ్మాయి ఏం కష్టంలో ఉందో, ఏమోనని అనుకున్న ఆ ఉద్యోగి బైక్ ఆపాడు. ఆమె ఎక్కి కూర్చున్న తరువాత కాస్తంత దూరం వెళ్లిన తరువాత, బైక్ ఆపాలని కోరింది. ఆపై బైక్ తాళాలు లాక్కుని, తనకు డబ్బివ్వాలని బెదిరించింది. లేకుంటే రేప్ చేసేందుకు ప్రయత్నించావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, అరుపులు, కేకలు పెడతానని భయపెట్టింది. దీంతో ఆందోళన చెందిన దీపక్, తన జేబులో ఉన్న రూ. 14 వేలను ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకుని ఆమె వెళ్లగానే, పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె ఎవరన్న విషయాన్ని తేల్చేందుకు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.