Vijay Devarakonda: శ్రీకాకుళం ప్రజలకు విజయ్ దేవరకొండ అండ.. తుపాను బాధితులకు ఆర్థిక సాయం!

  • ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షల విరాళం
  • బాధితులను ఆదుకోమని అభిమానులకు విజయ్ పిలుపు 
  • రూ.50 వేలు ప్రకటించిన బర్నింగ్ స్టార్ సంపూ

ఎక్కడ ఏ విపత్తు వచ్చి ప్రజలు అల్లాడిపోతున్నా సాయం చేయడంలో ముందుండే టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ మరోమారు ముందుకొచ్చాడు. తిత్లీ తుపానుతో అతలాకుతలం అయిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు తనవంతు సాయం ప్రకటించాడు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు అందించాడు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు.

 అంతేకాదు, తిత్లీ తుపాను కారణంగా దెబ్బతిన్న సిక్కోలును ఆదుకోవాల్సిందిగా ముందుకు రావాలంటూ అభిమానులకు పిలుపునిచ్చాడు. ఆయన పిలుపుతో పలువురు అభిమానులు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. ఆ వివరాలను స్క్రీన్ షాట్ తీసి విజయ్‌కు ట్వీట్ చేశారు.

కాగా, అందరికంటే ముందు టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు స్పందించాడు. తిత్లీ తుపాను బాధితులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించాడు. ఆ వెంటనే విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు ప్రకటించాడు. బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన వీరిద్దరిపైనా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇండస్ట్రీ నుంచి మరింతమంది ముందుకు వచ్చి శ్రీకాకుళం ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నారు.

కాగా, ఇటీవల వరదలతో అతలాకుతలమైన కేరళకు కూడా విజయ్ దేవరకొండ రూ.5 లక్షల విరాళం ప్రకటించాడు. తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేయగా వచ్చిన రూ.25 లక్షలను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించిన సంగతి తెలిసిందే.

Vijay Devarakonda
Srikakulam District
Titli cyclone
Tollywood
Sampoornesh Babu
  • Loading...

More Telugu News