Telugudesam: ఐటీ అధికారులు తెచ్చిన వారెంటే తప్పుడు వారెంటు : సీఎం రమేశ్
- నా భార్య పేరుతో సెర్చ్ వారెంట్ తీసుకొని వచ్చారు
- తనిఖీలకు కారణమడిగితేే నోరు మెదప లేదు
- నా నివాసాల్లో ఏమీ దొరకలేదు
- బ్యాంకు పత్రాలు దొరికితే కీలకపత్రాలంటూ దుష్ప్రచారం
టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నివాసాలు, కార్యాలయాలలో ఐటీ సోదాలు ముగిశాయి. కీలకపత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం రమేశ్ స్పందించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐటీ అధికారులు తెచ్చిన వారెంటే తప్పుడు వారెంటు అని, తనిఖీలకు కారణం చెప్పమని అడిగితే అధికారులు నోరుమెదపలేదని అన్నారు.
తెలంగాణ అధికారులు తమ నివాసాల్లో ఎందుకు తనిఖీలు చేస్తారని సదరు అధికారులను తాను ప్రశ్నించానని రమేశ్ చెప్పారు. తన భార్య పేరుతో సెర్చ్ వారెంట్ తీసుకొని వచ్చి హడావిడి చేశారని విమర్శించారు. తమ నివాసంలో ఏమీ దొరకలేదని, ఏమీ లేవని స్పష్టం చేశారు. బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన పత్రాలు మాత్రమే దొరికితే, కీలక పత్రాలు దొరికాయంటూ కొన్ని ఛానెళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.
తమ బంధువులు, స్నేహితులకు తన వ్యాపారాలతో ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ వాళ్ల నివాసాలపైనా ఐటీ అధికారులు దాడులు చేశారని అన్నారు. కేవలం, రాజకీయ కక్షతో భయానక వాతావరణం సృష్టించాలని, రాజకీయంగా ఎదుగుదల లేకుండా చేయాలని, అభాసుపాలు చేయాలనే ఉద్దేశంతోనే తన నివాసాలపై, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయని మరోసారి ఆరోపించారు.