Madhya Pradesh: రౌడీల్లా చెలరేగిపోవాలనుకున్నారు...పోలీసుల చేతికి చిక్కారు!
- మధ్యప్రదేశ్‌లో దారి తప్పిన యువకుల బృందం
- గొడవలు, అల్లర్లు కావాలంటే సంప్రదించాలని ఫేస్‌బుక్‌లో పోస్టింగ్
- అదుపులోకి తీసుకుని ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఎవరైనా మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. అయితే, మధ్యప్రదేశ్ లోని ఈ యువకులు మాత్రం గ్యాంగ్ స్టర్ లుగా పేరు తెచ్చుకోవాలనుకున్నారు. అంతే.. వెంటనే తమ గ్యాంగ్ పేరున పేస్‌బుక్‌లో ఓ అకౌంట్ క్రియేట్ చేశారు. ‘ఎక్కడైనా అల్లర్లు, గొడవలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి’ అంటూ ఓ పోస్టు పెట్టారు.
అంతేకాకుండా, నేర వార్తలు, ఫొటోలను పోస్టు చేస్తుండేవారు. ఈ సమాచారం తెలియగానే ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయింది. వెంటనే నిఘా పెట్టారు. పట్టణంలో కాల్పులు, అల్లర్లు, కత్తిపోట్లకు పాల్పడుతున్న 15 మంది యువకుల బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి ఐదు పిస్తోళ్లు, ఐదు తల్వార్లు, 8 చాకులు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ బృందం సభ్యులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తున్న సందర్భంలో అక్కడున్న జనం వీరిని కొట్టి, దుస్తులు చింపేయడం కొసమెరుపు.