Andhra Pradesh: తిత్లీ విధ్వంసం.. ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం చంద్రబాబు.. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-ccc5ae713495551b9496c39aadc93a14c797036a.jpg)
- 3 లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంటలు
- పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఏరియల్ సర్వే
- బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో 3 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతినగా, జిల్లాలో 12,000 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోనే మకాం వేసిన సీఎం చంద్రబాబు దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. 100 మంది డిప్యూటీ కలెక్టర్లను సహాయక చర్యల కోసం మోహరించారు. అలాగే జిల్లాను ఆదుకునేందుకు వీలుగా రూ.1,200 కోట్లు విడుదల చేయాలని ప్రధాని మోదీకి ఈ రోజు లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో ఈ రోజు వాతావరణం మెరుగుపడటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ లో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ జరిగిన నష్టాన్ని పరిశీలించారు. అనంతరం ఇచ్ఛాపురంలో దిగి తుపాను కారణంగా సర్వస్వం కోల్పోయిన కుటుంబాలను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలనీ, నష్టపోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హమీ ఇచ్చారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-fb493402dc9b428af1020cdd93d22da47c5cac1d.jpg)