me too: స్నేహితుడి కూతురిపై కూడా ఎంజే అక్బర్ లైంగిక వేధింపులు!
- పునాదులు కదిలిస్తున్న మీటూ ఉద్యమం
- ఎంజే అక్బర్ పై అమెరికా జర్నలిస్ట్ ఆరోపణ
- ఏషియన్ ఏజ్ ఎడిటర్ గా ఉన్నప్పుడు ఘటన
సినీ పరిశ్రమతో పాటు రాజకీయ, మీడియా రంగాల్లో ‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, దర్శకులు సుభాష్ ఘయ్, సాజిద్ ఖాన్, గీత రచయిత వైరముత్తు, టాటా మోటార్స్ ఉన్నతాధికారి సురేశ్ రంగరాజన్ తమను వేధించారంటూ పలువురు మహిళలు ముందుకొచ్చారు. ఇక కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తమను వేధించారంటూ దాదాపు 10 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను వెంటనే కేబినెట్ నుంచి తప్పించాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. దీంతో అక్బర్ పై త్వరలోనే వేటుపడే అవకాశముందని భావిస్తున్న తరుణంలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది.
ఎంజే అక్బర్ దగ్గర శిక్షణకు వచ్చిన సమయంలో తనను లైంగికంగా వేధించాడని అమెరికా పౌరురాలు, సీఎన్ఎన్ రిపోర్టర్ మజ్లీ డి పుయ్ కంప్ ఆరోపించింది. 2007 సమయంలో తాను ఏషియన్ ఏజ్ పత్రికలో ‘ఇన్ టర్న్’(శిక్షణ కోసం)గా చేరానని బాధితురాలు తెలిపింది. అప్పుడు ఏషియన్ ఏజ్ పత్రిక ఎడిటర్ గా అక్బర్ ఉన్నాడనీ, అతనికే తాను రిపోర్ట్ చేసేదానినని వెల్లడించింది. ‘ఇంటర్న్ షిప్ లో భాగంగా చివరిరోజు నేను డెస్క్ లో ఉండగా, అతను లేచి నా దగ్గరకు వచ్చాడు. దీంతో నేను లేచి కరచాలనం చేయబోయాను.
కానీ అతను నన్ను ఒక్కసారిగా దగ్గరకు లాక్కున్నాడు. పెదాలపై బలవంతంగా ముద్దుపెట్టాడు. తన నాలుకను నా నోటిలోకి తోస్తూ జుగుప్సాకరంగా ప్రవర్తించాడు. అప్పుడు నా వయసు 18 ఏళ్లే. నేనేం చేయలేక సైలెంట్ గా ఉండిపోయా’ అంటూ తన భయానక అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ఎంజే అక్బర్ తనకు తల్లిదండ్రుల ద్వారా పరిచయం అయ్యాడని మజ్లీ తెలిపింది. 90వ దశకంలో తన తల్లిదండ్రులు ఢిల్లీలో మీడియా కరస్పాండెంట్స్ గా పనిచేసేవారని వెల్లడించింది. తన దేశంలో ఒంటరిగా ఉంటున్న స్నేహితుడి కుమార్తెను కాపాడాల్సిన అక్బర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ వివరాలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.