china: చైనాపై గతంలో ఎన్నడూ లేనంతగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటాం: ట్రంప్
- చైనా వల్ల బిలియన్ల మేర ద్రవ్యలోటు ఏర్పడుతోంది
- ద్రవ్యలోటును పూడ్చుకోవడానికే సుంకాలను పెంచుతున్నాం
- సుంకాలను పెంచడం వల్లే స్టీల్ ఇండస్ట్రీ తిరిగి పుంజుకుంటోంది
చైనాపై ఉక్కుపాదం మోపబోతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఈ ఏడాది జూన్ నుంచి చైనా వస్తువులపై దిగుమతి సుంకాలను అమెరికా పలుమార్లు పెంచిన సంగతి తెలిసిందే. చైనా వల్ల తమకు బిలియన్ల మేర ద్రవ్యలోటు ఏర్పడుతోందని, దాన్ని పూడ్చుకోవడానికే సుంకాలను పెంచుతున్నామని ట్రంప్ తెలిపారు. 250 బిలియన్ డాలర్ల చైనా వస్తువులపై 25 శాతం సుంకాలను పెంచుతూ అమెరికా ఇటీవలే నిర్ణయం తీసుకుంది.
అణు సాంకేతిక వాణిజ్యంలో కూడా చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా తాజాగా ప్రకటించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, అమెరికన్లకు ఉద్యోగాలను కల్పించేందుకు తమ యంత్రాంగం తగిన చర్యలను చేపడుతుందని ట్రంప్ తెలిపారు. స్టీల్ పై సుంకాలను పెంచడం వల్లే అమెరికా స్టీల్ ఇండస్ట్రీ, ఒహిమో స్టీల్ ప్లాంట్ తిరిగి పుంజుకుంటున్నాయని చెప్పారు.