girl agitation: ప్రేమికుని ఇంటి ముందు యువతి మౌనపోరాటం
- మూడేళ్లుగా ప్రేమపాఠాలు వల్లించి పెళ్లి అనగానే ముఖం చాటేశాడని ఫిర్యాదు
- ప్రియుడిని ఎన్నివిధాలుగా కోరినా అంగీకరించక పోవడంతో పెద్దల వద్ద పంచాయతీ
- వారు చెప్పినా అంగీకరించక పోవడంతో ఇంటి ముందు బైఠాయింపు
మూడేళ్లుగా ప్రేమ పాఠాలు వల్లించాడు. చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. రైలులో ప్రారంభమైన ప్రేమ ప్రయాణానికి పెళ్లితో బ్రేక్ వేద్దామని చెప్పగానే ముఖం చాటేయడం మొదలు పెట్టాడు. దీంతో ప్రియుడి మెడలు వంచి తన మెడలో తాళికట్టించి న్యాయం చేయాలని కోరుతూ అతని ఇంటిముందు మౌనపోరాటానికి దిగింది ప్రియురాలు.
వివరాల్లోకి వెళితే...కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన పవన్ హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఓ యువతి బీటెక్ పూర్తిచేసి ప్రస్తుతం ఇంటివద్దే ఉంటోంది. మూడేళ్ల క్రితం ఓ సందర్భంలో రైలు ప్రయాణంలో ఇద్దరి మధ్య పరిచయమై ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి వీరి ప్రేమ రైలు పరిగెడుతూనే ఉంది. పది నెలల క్రితం సదరు యువతి పవన్ వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చింది. ససేమిరా అన్నాడు. ఏవో సాకులు చెప్పుకొచ్చాడు. అయినా యువతి పెళ్లికి ఒత్తిడి చేయడంతో తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు.
వ్యక్తిగతంగా కలవకపోవడమే కాకుండా, ఫోన్‌కి స్పందించక పోవడంతో అమీతుమీ తేల్చుకునేందుకు ఆ యువతి సిద్ధమైంది. బంధువులతో కలిసి పవన్ స్వగ్రామం పత్తికొండకు చేరుకుంది. పెద్దల వద్ద పంచాయతీ పెట్టించింది. పంచాయతీలో పవన్, అతని బంధువులు యువతితో పెళ్లికి అంగీకరించక పోవడంతో అతని ఇంటి ముందు బైఠాయించింది.
విషయం తెలిసిన పవన్, అతని బంధువులు ఇంటికి తాళంవేసి ఎటో వెళ్లిపోయారు. స్థానిక ఎస్‌ఐ శ్రీనివాసులు సిబ్బందితో వెళ్లి యువతిని ఒప్పించి స్టేషన్‌కు తీసుకువచ్చారు. పవన్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని, పెళ్లికి అంగీకరించకుంటే కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె శాంతించింది.