Andhra Pradesh: నాదెండ్ల మనోహర్, నేను ఒకే స్కూలులో చదువుకున్నాం.. మా ఇద్దరిని ఒకే కారణం కలిపింది!: పవన్ కల్యాణ్

  • అమరావతిలో పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభం
  • మీడియాతో ముచ్చటించిన జనసేన అధినేత
  • జనసైనికుల కవాతు తర్వాత శ్రీకాకుళం పర్యటన

నాదెండ్ల మనోహర్ రాకతో జనసేన మరింత బలోపేతం అయిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. శ్రీకాకుళంలో తిత్లీ తుపాను బీభత్సం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఈ ప్రాంతంలో పర్యటించాలని తాను భావించినప్పటికీ, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని వెనక్కి తగ్గినట్లు పేర్కొన్నారు. పరిస్థితులు మెరుగుపడ్డాక తాను తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తానని పవన్ అన్నారు.

ప్రస్తుతం తుపానుతో కకావికలమైన శ్రీకాకుళంలో సహాయక చర్యల్లో పాల్గొనాలని జన సైనికులకు పిలుపునిచ్చారు. అమరావతిలో ఈ రోజు పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం నాదెండ్ల మనోహర్, ఇతర నేతలతో కలిసి పవన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 15న రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజీపై జన సైనికుల కవాతు అనంతరం తొలుత వైజాగ్ కు, ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. అక్కడ చేపట్టాల్సిన సహాయక చర్యల వివరాలు తెలుసుకుంటామని వెల్లడించారు.

మనోహర్, తాను ఒకే స్కూలులో చదువుకున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. పార్టీ పెట్టాక తాను మనోహర్ నుంచి  సూచనలు, సలహాలు తీసుకునేవాడినని వెల్లడించారు. జవాబుదారీతనంతో కూడిన రాజకీయాన్ని తామిద్దరం కోరుకుంటున్నామనీ, అదే తామిద్దరినీ కలిపిందని వ్యాఖ్యానించారు. హోదా, ప్యాకేజీపై నాయకులు నాలుగు రకాల సందర్భాల్లో నాలుగు రకాల మాటలు మాట్లాడితే రాష్ట్ర భవిష్యత్ నాశనం అవుతుందని హెచ్చరించారు.

Andhra Pradesh
Pawan Kalyan
amaravati
Jana Sena
Srikakulam District
jana sainikula kawatu
nadendla manohar
  • Loading...

More Telugu News