Hyderabad: ప్రయాణికులకు చుక్కలు.. అమీర్ పేట్-మియాపూర్ మార్గంలో ఆగిపోయిన మెట్రో రైలు!
- విద్యుత్ సరఫరాలో లోపమే కారణమన్న సిబ్బంది
- సర్వీసుల ప్రారంభంపై ఇవ్వని స్పష్టత
- ఆందోళనకు దిగిన ప్రయాణికులు
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు ఈ రోజు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. రైల్వే మార్గంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మియాపూర్-అమీర్ పేట్ మార్గంలో మెట్రో సేవలు ఈ రోజు ఉదయం నిలిచిపోయాయి. అయితే ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పని మెట్రో సిబ్బంది వారికి టికెట్లు ఇచ్చి ప్లాట్ ఫాం మీదకు పంపారు. ఎంతసేపు వేచిచూసినా రైలు రాకపోవడం, మెట్రో సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తమ డబ్బులు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మెట్రో మార్గంలో విద్యుత్ లైన్లలో సాంకేతిక లోపం ఏర్పడటం వల్లే సర్వీసులు ఆగిపోయినట్లు తెలుస్తోంది. మళ్లీ ఎప్పుడు రైళ్లను పునరుద్ధరిస్తారన్న విషయమై మెట్రో అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో తమ డబ్బులు వెనక్కు ఇచ్చేయాలని పలువురు ప్రయాణికులు మెట్రో కౌంటర్లలో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తాము గంట నుంచి ఉన్నా రైలు రాకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగులు, విద్యార్థులు మెట్రో రైళ్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. తాజాగా అమీర్ పేట-మియాపూర్ మార్గంలో రైలు సేవలు నిలిచిపోవడంతో వీరంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సాంకేతిక సమస్య నేపథ్యంలో మిగతా రూట్లలోని మెట్రో సేవలకు కూడా అంతరాయం కలుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.