Bhadradri Kothagudem District: భర్త మందలించాడని ఉరేసుకున్న భార్య.. మనస్తాపంతో ట్రాన్స్ ఫార్మర్ పట్టుకున్న భర్త!

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం
  • ఫోన్ బిజీగా రావడంతో మందలించిన భర్త
  • క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్న యువతి

సంసారం అన్నాక చిన్నచిన్న గొడవలు వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో దంపతుల్లో ఎవరో ఒకరు వెనక్కి తగ్గినా సమస్య పరిష్కారమై పోతుంది. లేదంటే వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారుతుంది. తాజాగా భర్త మందలించాడని భార్య ఆవేశంలో ప్రాణాలు తీసుకోగా, తనవల్లే భార్య చనిపోయిందన్న మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ హృదయవిదారక ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని పాల్వంచ మండలం, సోములగూడెం గ్రామానికి చెందిన గోపిశెట్టి దుర్గారావుకు రెండు నెలల క్రితం పాత పాల్వంచకు చెందిన ఉషారాణితో వివాహమైంది. ప్రస్తుతం దుర్గారావు స్థానికంగా ఉండే ఓ ఇటుకల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఉషారాణికి ఫోన్ చేశాడు. అయితే చాలాసార్లు బిజీగా ఉన్నట్లు రావడంతో అసహనానికి లోనయ్యాడు. ఫోన్ కనెక్ట్ కాగానే, ఎవరితో మాట్లాడుతున్నావ్? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపానికి లోనైన ఉషారాణి వెంటనే ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సాయంత్రం స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న దుర్గారావు షాక్ కు గురయ్యాడు. తన కారణంగానే భార్య చనిపోయిందన్న ఆవేదనతో వీధి చివరన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ను పట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా హైఓల్టేజ్ విద్యుత్ అతని శరీరం ద్వారా ప్రవహించడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే దుర్గారావును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Bhadradri Kothagudem District
phone cal busy
couple suicide
Telangana
  • Loading...

More Telugu News