palaniswamy: తమిళనాడు సీఎం పళనిస్వామికి షాకిచ్చిన హైకోర్టు.. అవినీతి ఆరోపణల కేసు సీబీఐకి బదిలీ
- రోడ్డు కాంట్రాక్టులు బంధువులు, అనుచరులకు అప్పగించారంటూ ఆరోపణలు
- పళనిస్వామికి క్లీన్ చిట్ ఇచ్చిన విజిలెన్స్
- హైకోర్టును ఆశ్రయించిన డీఎంకే
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి షాక్ తగిలింది. తన అనుచరులు, బంధువులకు లబ్ధి చేకూరేలా రోడ్డు కాంట్రాక్టులను పళనిస్వామి అప్పజెప్పారనే కేసును మద్రాస్ హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. పళనిస్వామిపై ప్రతిపక్ష డీఎంకే చేసిన ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ విభాగం ఈ కేసును విచారించింది. ఎలాంటి అవకతవకలు జరగలేదంటూ పళనికి క్లీన్ చిట్ ఇచ్చింది. డీఎంకే ఆరోపణల్లో నిజం లేదని తేల్చింది.
ఈ నేపథ్యంలో డీఎంకే హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన జస్టిస్ ఏడీ జగదీష్ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు తెలిపారు. విచారణ పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతోనే సీబీఐకి అప్పగిస్తున్నట్టు చెప్పారు. వారం రోజుల్లోగా డాక్యుమెంట్లన్నింటినీ సీబీఐకి అప్పగించాల్సిందిగా విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు.