iran: ఈ రెండు లావాదేవీలు ఇండియాకు మేలు చేయవు: అమెరికా
- నవంబర్ 4 తర్వాత ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోరాదు
- తాము విధించబోయే ఆంక్షల గురించి మిత్ర దేశాలకు ఇప్పటికే తెలియజేశాం
- ఇరాన్ నుంచి ఉన్న ప్రమాదాన్ని అన్ని దేశాలు గుర్తించాలి
ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడం, రష్యా నుంచి మిస్సైళ్లను సమకూర్చుకోవడం ఇండియాకు మేలు చేయవని అమెరికా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.
ఇరాన్ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా ఆపేయాలని డొనాల్ట్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇరాన్ చేపట్టిన అణు కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతూ, ఆ దేశంపై ఆంక్షలను కూడా విధించింది. ఇదే సమయంలో తమతో స్నేహ సంబంధాలు ఉన్న దేశాలన్నీ ఇరాన్ నుంచి చమురు దిగుమతులను సున్నా స్థాయికి తీసుకురావాలని కోరుతూ, నవంబర్ 4వ తేదీని డెడ్ లైన్ గా విధించింది.
ఈ నేపథ్యంలో, నవంబర్ 4 తర్వాత కూడా ఇరాన్ నుంచి ఇండియా చమురును దిగుమతి చేసుకుంటే పరిస్థితి ఏమిటని యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి హెదర్ ను మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా, దీని వల్ల ఇండియాకు ఎలాంటి ఉపయోగం ఉండదని సమాధానం ఆమె ఇచ్చారు. నవంబర్ 4 తర్వాత కూడా ఇరాక్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటే విధించబోయే ఆంక్షల గురించి తమ మిత్ర దేశాలకు ఇప్పటికే చర్చల ద్వారా తెలిపామని వెల్లడించారు. అలాంటి దేశాల పట్ల తీసుకోబోయే చర్యలకు సంబంధించి తమ పాలసీలు చాలా స్పష్టంగా ఉన్నాయని తెలిపారు.
ఇరాన్ నుంచి ప్రపంచానికి ఎంతటి ముప్పు ఉందన్న విషయాన్ని తమ మిత్ర దేశాలు గ్రహించాలని హెదర్ అన్నారు. సమగ్ర సంయుక్త కార్యాచరణ ప్రణాళిక కింద తాము ఇచ్చిన నిధులను ప్రజా ప్రయోజనాలకు ఇరాన్ వినియోగించలేదని... ఇతర దేశాలకు ముప్పు కలిగించే కార్యక్రమాలకు ఉపయోగించిందని మండిపడ్డారు. రష్యా నుంచి ఎస్-400 డిఫెన్స్ సిస్టంను కొనుగోలు చేసినందుకు తాము ఏం చేయబోతున్నామో త్వరలోనే ఇండియా తెలుసుకుంటుందని ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్ చెప్పారని గుర్తు చేశారు. అధ్యక్షుడు చెప్పిన దానికంటే ఎక్కువ తాను చెప్పలేనని అన్నారు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు, రష్యా నుంచి ఎస్-400 కొనుగోలు అంశాలను అమెరికా తేలికగా తీసుకోబోదని చెప్పారు.