india corru[tion survey 2018: తెలంగాణలో 43 శాతం మంది లంచాలు ఇస్తున్నారు.. ఏపీలో తగ్గిన అవినీతి: ఇండియా కరప్షన్ సర్వే
- లంచాలు ఇవ్వడంలో తెలంగాణది 8వ స్థానం
- 6వ స్థానం నుంచి 11వ స్థానానికి తగ్గిన ఏపీ
- అవినీతిలో ఉత్తరప్రదేశ్ దే తొలి స్థానం
వివిధ విభాగాల్లో తెలంగాణ, ఏపీలు జాతీయ స్థాయిలో తమ ర్యాంకులను మెరుగుపరచుకుంటున్నప్పటికీ... ఇరు తెలుగు రాష్ట్రాల్లో అవినీతి కూడా అదే స్థాయిలో ఉంది. ఈ విషయాన్ని 'ఇండియా కరప్షన్ సర్వే 2018' తేటతెల్లం చేసింది.
తెలంగాణలో 43 శాతం మంది తమ పనులను చేయించుకోవడానికి సంబంధిత అధికారులకు లంచాలు ఇస్తున్నారు. ఏపీలో 38 శాతం మంది లంచం ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ 50 శాతం, పంజాబ్ 56 శాతం, తమిళనాడు 52 శాతం మందితో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ సర్వేను నోయిడా కేంద్రంగా పని చేసే 'లోకల్ సర్కిల్స్' అనే కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్... ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియాతో కలసి నిర్వహించింది.
లంచాలను అధికంగా ఇస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. 2017లో కూడా తెలంగాణ ఇదే స్థానంలో ఉంది. జాబితాలో ఏపీది 11వ స్థానం. 2017లో ఏపీ 6వ స్థానంలో నిలవగా... ఈ ఏడాది ఆంధ్రలో అవినీతి కొంత మేర తగ్గింది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు, భూమి సమస్యల కోసం తెలంగాణలో 68 శాతం మంది, ఏపీలో 50 శాతం మంది లంచాలు ఇస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది తర్వాత పోలీస్, మున్సిపల్ కార్పొరేషన్, ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఉద్యోగులకు ఎక్కువ లంచాలు ఇస్తున్నారు. అవినీతిని తగ్గించడంలో ఏపీ సఫలమైందని లోకల్ సర్కిల్స్ ఛైర్మన్ సచిన్ తపారియా తెలిపారు.